ముగ్గురు పిల్లలకు.. మూడు టార్గెట్‌లు ఇచ్చిన ముఖేష్‌ అంబానీ!

30 Dec, 2022 13:50 IST|Sakshi

బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ 2023 చివరి నాటికల్లా 5జీ నెట్‌ వర్క్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు. తద్వారా రీటైల్‌ విభాగంలో మరిన్ని లక్ష్యాల్ని అధిరోహించి రిలయన్స్‌ సామ్రాజ్యాన్ని మరింత వృద్ధి చేయాలని తన ముగ్గురు పిల్లలకు పిలుపునిచ్చారు. అందుకు ఇటీవల ఖతార్‌లో జరిగిన ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనాను ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టిన అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్ మెస్సి టీమ్‌ వర్క్‌, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకోవాలని సూచించారు. 

 2021 రిలయన్స్ ఫ్యామిలీ డేలో తన వారసత్వ ప్రణాళిక గురించి ముఖేష్‌ అంబానీ మాట్లాడారు. ముగ్గురు పిల్లల కోసం తన వ్యాపారాన్ని మూడు భాగాలుగా విభజించి పెద్ద కుమారుడు ఆకాష్ కోసం టెలికాం, డిజిటల్ బిజినెస్‌.., కవలలైన ఇషా అంబానీకి రిటైల్..అనంత్ అంబానీకి కోసం న్యూ ఎనర్జీ బిజినెస్‌ బాధ్యతలు అప్పగించారు. 

ఈ ఏడాది రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా.. భవిష్యత్‌లో రిలయన్స్‌ సాధించాల్సిన మూడు లక్ష్యాల గురించి మాట్లాడారు.‘‘సంవత్సరాలు...దశాబ్దాలు గడిచిపోతాయి.. రిలయన్స్ మర్రి చెట్టులాగా పెద్దదవుతూనే ఉంటుంది. దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తాయి. వేర్లు మరింత లోతుకు వెళ్తాయి. నానాటికీ పెరుగుతున్న భారతీయులు జీవితాలు స్ప్రృశిస్తూ వారి జీవితాల్ని సుసంపన్నం చేయడం, వారిని శక్తివంతం చేయడం, వారిని పోషించడం,వారి పట్ల శ్రద్ధ వహించడమే రిలయన్స్‌ లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఐదేళ్లలో రిలయన్స్ 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో నాయకులు,ఉద్యోగుల నుంచి సంస్థ యొక్క అంచనాలను తెలియజేయాలన్నారు.

ఆకాష్ అంబానీ 
"ఆకాష్ అధ్యక్షతన, ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా జియో భారతదేశం అంతటా ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ నెట్‌వర్క్‌ను విడుదల చేస్తోంది. జియో 5జీ విస్తరణ 2023లో పూర్తవుతుంది" అని అన్నారు. అయితే జియో ప్లాట్‌ఫారమ్‌లు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు ప్రత్యేకమైన డిజిటల్ ఉత్పత్తులు, ఆయా సమస్యలకు పరిష్కారాలను అందించాల్సిన అవసరం ఉంది.ప్రతి ఒక్క గ్రామం 5జీ కనెక్టివిటీని కలిగి ఉంటుంది కాబట్టి.. నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి సౌకర్యాలతో గ్రామీణ-పట్టణల మధ్య అంతరాన్ని తగ్గించేలా జియో భారతదేశం యొక్క సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందనే అభి ప్రాయం వ్యక్తం చేశారు. 

ఇషా అంబానీ 
ఇషా సారధ్యంలో రిటైల్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. రిటైల్ టీమ్‌లోని మీరందరూ మరింత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు అధిరోహించే సత్తా మీకుందంటూ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు. జియో తరహాలో రిటైల్ బిజినెస్‌ దేశ సమగ్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుంది. మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం,  ఎస్‌ఎంఈలకు మరింత ఉత్పాదకతను పెంచి వ్యాపారులు మరింత సంపన్నంగా మారడంలో సహాయపడుతుందని అన్నారు. 

అనంత్‌ అంబానీ 
రిలయన్స్‌ కొత్త సామర్థ్యాలు, అనుకున్న లక్ష్యాలతో ఆయిల్-టు-కెమికల్ వ్యాపారంలో తన నాయకత్వాన్ని పెంచుకుంటూనే ఉంది. అలాగే మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యాపారాన్ని డిజిటల్‌ సేవలతో అనుసంధానం చేయడం వల్ల పరిశ్రమకు పునరుత్తేజం అవుతుందని ముఖేష్‌ అంబానీ చెప్పారు. గిగా కర్మాగారాలను నిర్మించడంతోపాటు హైడ్రోజన్ వ్యాపారంలోకి ప్రవేశించడం, తద్వారా కొత్త ఇంధన వ్యాపారం సంస్థను మార్చగల సామర్ధ్యం. ఈ రాబోయే తరం వ్యాపారంలో అనంత్ చేరడంతో, జామ్‌నగర్‌లోని గిగా ఫ్యాక్టరీలను సిద్ధం చేయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్నాం’ అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు 'గ్రీనెస్ట్' కార్పొరేట్‌గా కూడా అవతరించే మార్గంలో ఉందని రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తెలిపారు.

మరిన్ని వార్తలు