ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో ముఖేష్‌ అంబానీ టాప్‌

8 Oct, 2020 16:06 IST|Sakshi

టాప్‌ప్లేస్‌లో వరుసగా పదమూడో సారి!

ముంబై : భారత్‌లో వందమందితో కూడిన అత్యంత సంపన్నల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ అధిపతి, కార్పొరేట్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ మరోసారి అగ్రస్ధానంలో నిలిచారు. 8,800 కోట్ల డాలర్ల సంపదతో ముఖేష్‌ 2020 సంవత్సరానికి ఫోర్బ్స్‌ ఇండియా జాబితాలో నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ను మళ్లీ నిలుపుకున్నారు. ఈ జాబితాలో ముఖేష్‌ అంబానీ గత 13 సంవత్సరాలుగా మొదటి ర్యాంక్‌లో కొనసాగడం గమనార్హం. ఇక అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 2500 కోట్ల డాలర్ల సంపదతో ఫోర్భ్స్‌ ఇండియా జాబితాలో ముఖేష్‌ తర్వాతి స్ధానంలో నిలిచారు. ఈ ఏడాది ముఖేష్‌ అంబానీ సంపదకు తాజాగా 375 కోట్ల ఆస్తులు అదనంగా తోడయ్యాయని ఫోర్బ్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కుదేలైనా భారత్‌లో అత్యంత కుబేరులు తమ సంపదను కాపాడుకున్నారని ఫోర్భ్స్‌ వ్యాఖ్యానించింది. ముఖేష్‌ అంబానీ వరుసగా 13వ సారి భారత్‌లో అత్యంత సంపన్నుడిగా నిలిచారని, వ్యాక్సిన్‌ తయారీదారు సైరస్‌ పూనావాలా ఆరో ర్యాంక్‌ను సాధించి టాప్‌ 10లో చోటు సంపాదించారని నివేదిక వెల్లడించింది. కరోనా వైరస్‌ కట్టడికి కీలకమైన మందులు, వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైన ఫార్మా దిగ్గజాల సంపద అనూహ్యంగా పెరిగింది. బయోకాన్‌ కిరణ్‌ మజుందార్‌ షా సంపద శాతాల ప్రాతిపదికన అత్యధికంగా ఎగిసిందని, కొద్దిమంది బిలియనీర్ల సంపద మాత్రం గత ఏడాదితో పోలిస్తే 2020లో తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది.

చదవండి : ముకేశ్‌ అంబానీ ఖాతాలో మరో రికార్డు

మరిన్ని వార్తలు