‘మూడేళ్లలోనే 4జీ నెట్‌వర్క్‌ నిర్మించాం’

8 Oct, 2020 17:30 IST|Sakshi

ముఖేష్‌ అంబానీ

ముంబై : రిలయన్స్‌ జియో కేవలం మూడేళ్లలోనే 4జీ నెట్‌వర్క్‌ను నిర్మించగా, ఇతర టెలికాం కంపెనీలకు 2జీ నెట్‌వర్క్‌ నిర్మాణానికి పాతికేళ్లు పట్టిందని రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించేందుకు జియో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. టీఎం ఫోరం ఆధ్వర్యంలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వరల్డ్‌ సిరీస్‌ 2020 వర్చువల్‌ భేటీని ఉద్దేశించి ముఖేష్‌ మాట్లాడుతూ జియో ప్రస్ధానాన్ని వివరించారు. జియో 4జీ నెట్‌వర్క్‌ ద్వారా భారతీయులకు అల్ట్రా హైస్పీడ్‌ కనెక్టివిటీ, సహేతుకమైన ధరల్లో ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తీరును ముఖేష్‌ అంబానీ గుర్తుచేశారు.

జియోకు ముందు భారత్‌ 2జీ టెక్నాలజీకే పరిమితమైందని, భారత్‌ డేటా కష్టాలకు ముగింపు పలకాలని జియో నిర్ణయించుకుని డిజిటల్‌ విప్లవాన్ని చేపట్టిందని చెప్పారు. దేశమంతటా అత్యధిక వేగంతో పాటు మెరుగైన కవరేజ్‌తో ప్రపంచ శ్రేణి డిజిటల్‌ నెట్‌వర్క్‌ను సృష్టించామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిఫ్స్‌ను తాము ప్రవేశపెట్టామని, జియో యూజర్లకు వాయిస్‌ సేవలను పూర్తి ఉచితంగా అందించామని చెప్పుకొచ్చారు. జియోకు ముందు స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయలేక, 2జీ ఫీచర్‌ ఫోన్లతో సాధ్యంకాక వందకోట్ల భారతీయుల్లో సగానికి పైగా డిజిటల్‌ ఉద్యమానికి దూరంగా ఉన్నారని అన్నారు.

2016లో టెలికాం పరిశ్రమలోకి జియో ప్రవేశించినప్పటి నుంచి మొబైల్‌ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్ధానంలో ఉన్న భారత్‌ అగ్రస్ధానానికి ఎగబాకిందని తెలిపారు. జియో తన ప్రస్ధానం మొదలుపెట్టిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను ఆకట్టుకుందని చెప్పారు. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లు జియో నెట్‌వర్క్‌లో చేరుతున్నారని చెప్పారు. భారత్‌లో డేటా నెలసరి వినిమయం 0.2 బిలియన్‌ జీబీ నుంచి 600 శాతం వృద్ధితో 1.2 బిలియన్‌ జీబీకి ఎగబాకిందని, ఇక అప్పటి నుంచి డేటా వినిమయం భారీగా పెరిగిందని వివరించారు. దేశంలో ప్రస్తుతం జియో రాక మునుపుతో పోలిస్తే నెలకు 30 రెట్లు అధికంగా డేటా వినిమయం జరుగుతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. చదవండి : రిలయన్స్ జియో మరో బంపర్‌ ఆఫర్‌..

మరిన్ని వార్తలు