ఏ డయాబెటిక్‌ చెఫ్‌: షుగర్‌ జీరో.. స్వీటు హీరో!

23 Jul, 2021 14:22 IST|Sakshi

స్వీట్‌ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ముంబై కుర్రాడు హర్ష్‌ కేడియకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అయితే ఆ అమితమైన ఇష్టానికి డయాబెటిస్‌ బ్రేక్‌ వేసింది. పన్నెండేళ్ల వయసులో హర్ష్‌ డయాబెటిస్‌ బారిన పడ్డాడు. ఇక అప్పటి నుంచి జీవనశైలి, అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది.

పార్టీలకు... చెక్‌.. స్వీట్లకు... కట్‌
పార్టీలకు... చెక్‌..స్వీట్లకు.... కట్‌... ఇలా రకరకాల చెక్‌లతో జీవితం దుర్భరప్రాయంగా అనిపించింది. ఖైదీ జీవితానికి తన జీవితానికి తేడా ఏమిటి! అని కూడా అనిపించింది. నోరు కట్టేసుకోకుండా రుచి మొగ్గలను మళ్లీ హుషారెత్తించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ‘అసలు ఈ డయాబెటిస్‌ ఏమిటి?’ అని దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి భారీ కసరత్తే చేశాడు. చాక్లెట్‌లో షుగర్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు రెండు వందల మందికి పైగా వైద్యులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. టీవీల్లో టూత్‌ పేస్ట్‌ యాడ్‌ లా.. ఈ చాక్లెట్‌ లో షుగర్‌ ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

‘ఏ డయాబెటిక్‌ చెఫ్‌’
మార్కెట్టులో ‘షుగర్‌–ఫ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్న చాలా చాక్లెట్లలో ఎంతో కొంత షుగర్‌ కూడా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ నేపథ్యంలోనే ‘డయాబెటిక్‌ ఫ్రెండ్లీ చాక్లెట్‌’ అనే ఐడియా మదిలో మెరిసింది.పేరుకి ‘షుగర్‌–ఫ్రీ’ అని కాకుండా 100 శాతం షుగర్‌–ఫ్రీ చాక్లెట్‌ తయారీ కోసం ఆలోచించాడు. ఎన్నో పుస్తకాలు తిరగేశాడు. అంతర్జాల సమాచార సముద్రంలో దూకాడు. డాక్టర్లు, న్యూట్రీషనిస్ట్‌లు, ఫుడ్‌సైంటిస్టులను కలిశాడు. తన నుంచి ఒక చెఫ్‌ బయటికి వచ్చాడు. ప్రయోగాల్లోనే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న హర్ష్‌ రకరకాల కంపెనీలలో పనిచేసి బిజినెస్‌ స్కిల్స్‌ను ఒంటబట్టించుకున్నాడు. తాను చేసిన పరిశోధన, వ్యాపార నైపుణ్యాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు...అలా ముంబై కేంద్రంగా ‘ఏ డయాబెటిక్‌ చెఫ్‌’ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ‘ఈ వయసులో ఇదొక దుస్సాహాసం’ అన్నవారు కూడా లేకపోలేదు. ‘సాహాసానికి వయసుతో పనేమిటి’ అని వెన్నుతట్టిన వారు కూడా లేకపోలేదు.


‘యంగ్‌ ట్రెండ్‌సెట్టర్‌’

టాప్‌ క్వాలిటీ ఇన్‌గ్రేడియంట్స్‌తో, రుచితో రాజీ పడకుండా, అయిదు రకాల ఫ్లేవర్‌లతో తయారుచేసిన ‘ఏ డయాబెటిక్‌’ చెఫ్‌ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి టాక్‌ వచ్చింది. 24 సంవత్సరాల హర్ష్‌ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్‌ 30–ఫోర్బ్స్‌ ‘యంగ్‌ ట్రెండ్‌సెట్టర్‌’ జాబితాలో చోటు సంపాదించాడు. మోటివేషనల్‌ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న హర్ష్‌ కెడియ పేద డయాబెటిక్‌ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాడు.

మోటివేషనల్‌ స్పీకర్‌గా
హర్ష్‌ కెడియ పుస్తకాలు చదువుతాడు. తన భావాలను కాగితాలపై పెడతాడు. రచన అతనికేమీ కొత్తకాదు.‘డయాబెటిస్‌ సమస్య నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం వరకు తన అనుభవాలకు పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది కదా!’ అనేవాళ్లతో మనం కూడా గొంతు కలుపుదాం. ఒక ప్రాడక్ట్‌కు మార్కెట్‌లో మంచి టాక్‌ రావాలంటే...అది పేరుతోనే మొదలవుతుంది. ‘ఏ డయాబెటిక్‌ చెఫ్‌’ అనే పేరుతో తొలి అడుగులోనే మార్కులు కొట్టేసిన హర్ష్‌ కేడియ యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మోటివేషనల్‌ స్పీకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పేదరోగులకు సహాయం చేస్తూ మంచిమనసును చాటుకుంటున్నాడు.

>
మరిన్ని వార్తలు