చందా కొచర్‌కు మరోసారి నిరాశ 

24 Oct, 2020 12:41 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, ముంబై:  ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్  నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసిన చందాకొచర్ భర్త దీపక్ కొచ్చర్ కు ఊరట కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19  చికిత్స నిమిత్తం  అనుమతి కోరుతూ పెట్టుకున్న విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు  తిరస్కరించింది.

ముంబైలోని తలోజా జైలులో ఉండగానే ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే కోలుకున్న తరువాత ఆందోళనలో ఉన్న కొచర్‌ను మరింత మెరుగైన వైద్యంకోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే  ఈ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ పీ రాజవైద్యా తోసిపుచ్చారు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ క్విడ్ ప్రో కో కింద వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1875 కోట్ల రూపాయల రుణాలను అక్రమ మంజూరు ఆరోపణలు, వారి వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు