ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు, ‘ట్విటర్‌ దివాలా తీయొచ్చు..నేడో..రేపో’!

11 Nov, 2022 11:00 IST|Sakshi

సీఈవో ఎలాన్‌ మస్క్‌ అనాలోచిత నిర్ణయాల వల్ల ట్విటర్‌ చిక్కుల్లో పడనుందా? మస్క్‌ కొనుగోలు తర్వాత ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్‌ పెయిడ్‌ వెరిఫికేషన్‌, ట్విటర్‌లో అడ్వటైజ్మెంట్స్‌ నిలిపివేసే సంస్థల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం వంటి నిర్ణయాలతో ఆ సంస్థ దివాలా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఉద్యోగులతో మస్క్‌ చర్చించినట్లు సమాచారం.  

ఉద్యోగులతో మాట్లాడే సమయంలో ట్విటర్ సంస్థ దివాళా తీసే అవకాశం ఉందనే అంశాన్ని ఎలాన్‌ మస్క్‌ సైతం తోసిపుచ్చలేదంటూ బ్లూమ్‌బెర్గ్ సైతం నివేదించింది. అయితే అందుకు కారణం..మస్క్‌ 44 బిలియన్‌ డాలర్ల కొనుగోలు చేసిన రెండు వారాల తర్వాత ట్విటర్‌లో ఆర్ధిక అనిశ‍్చితి నెలకొందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక సంస్థ ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మస్క్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు రాయిటర్స్‌ తెలిపింది. బుధవారం ట్విటర్‌ ఎక్జిగ్యూటీవ్‌లు యోయెల్ రోత్‌ , రాబిన్ వీలర్‌తో నిర్వహించిన ట్విటర్‌ స్పేస్‌ చాట్‌లో మస్క్‌ ప్రకటనదారుల ఆందోళనలను తగ్గించడానికి ప్రయత్నించారని రాయిటర్స్‌ హైలెట్‌ చేసింది. 

దీనికి తోడు సంస్థ ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషించే ట్విటర్‌ సీనియర్‌ ఉద్యోగులు ఒక్కొక్కరిగా వైదొలగడం చర్చాంశనీయంగా మారింది. ట్విటర్‌  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్, చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కీరన్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ మరియాన్ ఫోగార్టీలు రాజీనామా చేయడంతో ట్విటర్ యాజమాన్యం ఆందోళనకు గురైందని, ఇలా ఉద్యోగుల రాజీనామాలతో ట్విటర్‌ దివాలా తీయడం ఖాయమంటూ మస్క్‌ ఉద్యోగులతో హెచ్చరించారు. ట్విటర్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని యూఎస్‌ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తెలిపింది.     

చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది 
ఇటీవల కాలంలో ట్విటర్‌లో జరుగుతున్న వరుస పరిణామాలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్‌ ట్రేడ్‌ ఏజెన్సీ కమిషన్‌ (ఎఫ్‌టీసీ) స్పందించింది. ప్రభుత్వ న్యాయ చట్టాలను ధిక్కరిస్తూ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని’ఎఫ్‌టీసీ స్పష్టం చేసింది. ట్విటర్‌లో జరుగుతున్న పరిణామాల్ని ఎప్పటికపప్పుడు ట్రాక్‌ చేస్తున్నాం.‘ సీఈవోలు లేదా సంస్థలు చట్టానికి అతీతం కాదు. ఎఫ్‌టీసీ నిబంధనలు లోబడి పనిచేయాలి. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’ ఎఫ్‌టీసీ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ డగ్లస్ ఫర్రార్ రాయిటర్స్‌తో అన్నారు. 

మస్క్‌కి బయపడం
మే నెలలో ట్విటర్‌ యూజర్ల ఫోన్‌నెంబర్లను దుర్వినియోగం చేసింది. భద్రతా కారణాల కోసం మాత్రమే సమాచారాన్ని సేకరించినట్లు వినియోగదారులకు తెలిపింది.అదే అంశంపై ఎఫ్‌టీసీ ట్విటర్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను ట్విటర్‌ 150 మిలియన్‌ డాలర్లను ఎఫ్‌టీసీకి చెల్లించడానికి అంగీకరించింది.  
150 మిలియన్‌ డాలర్ల చెల్లించేందుకు కొంత సమయం, సంస్థలోని పరిణామాలపై ఎఫ్‌టీసీ- ట్విటర్‌ మధ్య జరిగిన ఇంటర్నల్‌ మెయిల్స్‌ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల ప్రకారం.. ఎలాన్‌ మస్క్‌ భారీ ఎత్తున నష్టపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ట్విటర్‌ లీగల్ చీఫ్ అలెక్స్ స్పిరో ఎఫ్‌టీసీ అటార్నీ జర్నల్‌ ఆల్డెన్ ఎఫ్‌ అబాట్ అన్నారు. అందుకు అటార్నీ ఎలాన్‌ మస్క్‌ అంతరిక్షంలోకి పంపియొచ్చు. కానీ అతనికి ఎఫ్‌టీసీ బయపడదు’ అని ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. 

స్పందించని ట్విటర్‌
గురువారం మధ్యాహ్నం ట్విట్టర్‌లో ఉద్యోగులందరితో నిర్వహించిన సమావేశంలో.. వచ్చే ఏడాది కంపెనీ బిలియన్ల డాలర్లను కోల్పోవచ్చని మస్క్ హెచ్చరించినట్లు సమాచారం. కాగా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ట్విటర్‌ దివాలా తీసే అవకాశం, ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ హెచ్చరికలు, ఉద్యోగుల రాజీనామాలపై ట్విటర్‌ స్పందించలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. 

చదవండి👉 మాయదారి ట్విటర్‌..మంచులా కరిగిపోతున్న ఎలాన్‌ మస్క్‌ సంపద!

మరిన్ని వార్తలు