ముత్తూట్‌లో బంగారం క్షేమమేనా? షేర్లు ఢమాల్‌

8 Mar, 2021 14:42 IST|Sakshi

ముత్తూట్‌ గ్రూపు  చైర్మన్‌ ఎంజీ జార్జ్ ముత్తూట్ అనుమానాస్పద మరణం

 దెబ్బతిన్ని ఇన్వెస్టర్ల  సెంటిమెంట్‌, అమ్మకాల ఒత్తిడి

 భారీ నష్టాల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేర్లు

సాక్షి, ముంబై : బంగారు రుణ సంస్థ ముత్తూట్‌ గ్రూపు  చైర్మన్‌, హోల్ టైమ్ డైరెక్టర్ ఎంజీ జార్జ్ ముత్తూట్ (71) అనుమానాస్పద మరణం ఇన్వెస్టర్ల సెంటిమెంటును తీవ్రంగా ప్రభావితం చేసింది. వీంతో సోమవారం బుల్‌ మార్కెట్‌లో కూడా ముత్తూట్‌ ఫైనాన్స్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  ఆరంభంలోనే  6.57 శాతం క్షీణించి బీఎస్‌ఈలో  1205 రూపాయల ఇంట్రాడే  కనిష్టానికి చేరుకున్నాయి.  ప్రస్తుతం 3 శాతం వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు  సంస్థ పెద్ద మరణంతో ముత్తూట్‌ ఫైనాన్స్‌ లో తమ బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్న వినియోగదారుల్లో  భారీ ఆందోళన నెలకొంది. (Muthoot Group: ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ దుర్మరణం)

జార్జ్ ముత్తూట్‌  అకాలమరణంపై విచారం వ్యక్తం చేసిన ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఆయన నాయకత్వంలో సరికొత్త వృద్ధిని నమోదు చేసిందని, గోల్డ్ లోన్ ఇండస్ట్రీలో మార్కెట్ లీడర్ అయ్యిందని కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన ఆకస్మిక మరణం కుటుంబం, సన్నిహితులతోపాటు, కంపెనీకి, ఉద్యోగులకు తీరని నష్టమంటూ సంతాపాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ముత్తూట్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని  తెలియజేస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది, కానీ ఆయన మరణానికి కారణం కంపెనీ ప్రస్తావించలేదు.

అయితే తన నివాసంలోని నాలుగో అంతస్తునుంచి పడి జార్జ్ ముతూట్ చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేట్‌ను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు దీనిపై ఢిల్లీలోని ఎయిమ్స్  ఫోరెన్సిక్ విభాగం ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డును ఏర్పాటు చేసింది. ఈ కేసులో వారు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారని, ఎయిమ్స్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ కుమార్ గుప్తా వెల్లడించారు. కాగా జార్జ్ ముతూట్ అనుమానాస్పద పరిస్థితుల్లో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. జార్జ్ ముత్తూట్‌ 1993లో ముత్తూట్‌ గ్రూపునకు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంస్థ భారీగా విస్తరించింది.  గత దశాబ్దంలో మార్కెట్  క్యాప్‌ను దాదాపు ఎనిమిది రెట్ల మేర వృద్ధి చెందేలా కృషి చేశారు.

మరిన్ని వార్తలు