క్యూ2లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు రూ. 34,765 కోట్లు 

14 Nov, 2023 07:16 IST|Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మొత్తం మీద రూ.34,765 కోట్ల పెట్టుబడులను నికరంగా ఆకర్షించింది. అంతకుముందు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు రూ.1.85 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ పెట్టుబడుల రాక సానుకూలంగానే ఉంది. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ (డెట్‌ ఫండ్స్‌) విభాగంపై ఎక్కువ ప్రభావం పడింది. వీటి నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

ఫండ్స్‌ నుంచి జూలైలో రూ.82,467 కోట్ల పెట్టుబడులు రాగా, ఆగస్ట్‌లో రూ.16,180 కోట్లకు పరిమితమయ్యాయి. సెప్టెంబర్‌ నెలలో రూ.63,882 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దీంతో నికరంగా రూ.34,765 కోట్ల పెట్టుబడులు నమోదైనట్టు మార్నింగ్‌ స్టార్‌ ఇండియా నివేదిక తెలిపింది. జూన్‌ త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులు నాలుగేళ్లలోనే గరిష్ట స్థాయి అని పేర్కొంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్‌ చివరి నుంచి సెప్టెంబర్‌ చివరికి 5 శాతం పెరిగి రూ.46.22 లక్షల కోట్లుగా ఉంది. గత పది త్రైమాసికాల్లోనే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. ఈక్విటీ పథకాల్లోకి నికరంగా రూ.41,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన రూ.18,358 కోట్లతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగాయి. ఇక డెట్‌ ఫండ్స్‌ నుంచి రూ.65,944 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఈ విభాగం రూ.1.38 లక్షల కోట్లు ఆకర్షించడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.    

మరిన్ని వార్తలు