ఫండ్స్‌ విలీనంతో ఇన్వెస్టర్లపై భారం పడుతుందా? 

11 Jul, 2022 10:37 IST|Sakshi

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ లోగడ రెండు పథకాలను విలీనం చేసింది, కొత్త పథకం యూనిట్లను ఇన్వెస్టర్లకు కేటాయించింది. మూలధన లాభాల కోణంలో దీన్ని ఎలా చూడాలి?   – బ్రిజ్‌ మోహన్‌లాల్‌

గత ఆర్థిక సంవత్సరంలో పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల విలీనాన్ని చూశాం. చాలా వరకు ఒక ఏఎంసీని మరో ఏఎంసీ కొనుగోలు చేయడం వల్లే ఇలా జరిగింది. ప్రిన్సిపల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను 2021 డిసెంబర్‌లో సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది. బీఎన్‌పీ పారిబాస్‌లో బరోడా ఏఎంసీ విలీనం అయింది. అలాగే, ఒక మ్యూచువల్‌ ఫండ్‌కు చెందిన పలు పథకాల విలీనాన్ని కూడా గతంలో చూశాం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక అయోమయం చెందుతుంటారు.

2021-22 ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేయాల్సిన వారు ఆందోళన చెందడం సహజం. మ్యూచువల్‌ ఫండ్స్‌ విలీనం వల్ల ఇన్వెస్టర్లు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. వారు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విలీనం తర్వాత కొత్త పథకంలో పెట్టుబడులు కొనసాగించాలని అనుకుంటే అవి ఆటోమేటిక్‌గా బదిలీ అవుతాయి. కనుక అటువంటి సందర్భంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఉదాహరణకు ఫండ్‌ ఏ, ఫండ్‌ బీని తీసుకుందాం. ఫండ్‌ ఏను తీసుకెళ్లి ఫండ్‌ బీలో విలీనం చేశారు. ఫండ్‌ ఏలో ఆరు నెలల క్రితం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, విలీనం నాటికి అది రూ.2 లక్షలు అయింది. ఫండ్‌ బీ ఎన్‌ఏవీ రూ.160గా ఉంది. అప్పుడు రూ.2 లక్షలను 160తో భాగిస్తే 1,250 యూనిట్లు వస్తాయి. ఈ యూనిట్లను మరో ఆరు నెలల తర్వాత విక్రయించారు. అప్పుడు మొత్తం హోల్డింగ్‌ పీరియడ్‌ ఏడాది అవుతుంది. ముందు పథకంలో ఆరు నెలలు, విలీనం పథకంలో ఆరు నెలలు. ఏడాదికి మించిన కాలానికి ఈక్విటీ లాభాలు దీర్ఘకాల మూలధన లాభాల కిందకు వస్తాయి. ఆ ప్రకారం పన్ను చెల్లించాలి.  

పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి?     – వెంకట్రావ్‌ 
పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్‌ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్‌ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్‌ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్‌ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్‌ క్యాప్‌ కలిగిన (డైవర్సిఫైడ్‌) కంపెనీల్లో ఫండ్‌ మేనేజర్‌ పెట్టుబడులు పెడతారు.  


ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్‌ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్‌ తగ్గించే విధంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్స్‌ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్‌ చేసినట్టు అవుతుంది.


ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ 

>
మరిన్ని వార్తలు