ఫండ్స్‌లోకి భారీగా కొత్త పెట్టుబడులు

26 Sep, 2022 09:58 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ వేదికల అనుసంధానత, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పట్ల పెరుగుతున్న అవగాహన ఫలితాలనిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్‌–ఆగస్ట్‌) 70 లక్షల కొత్త ఖాతాలు (ఫోలియోలు) ప్రారంభం కావడం గమనార్హం. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమలో ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాల సంఖ్య 13.65 కోట్లకు చేరింది. ఈ ఏడాది మార్చి చివరికి ఫోలియోలు 12.95 కోట్లుగా ఉన్నాయి. 2020–21లో 81 లక్షలు, 2021–22లో 3.17 కోట్ల చొప్పున కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఈ గణాంకాలు ఫండ్స్‌ మార్కెట్లోకి పెద్ద ఎత్తున కొత్త ఇన్వెస్టర్ల రాకను సూచిస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

డీమోనిటైజేషన్‌ గృహ పొదుపులు డిజిటలైజ్‌కు దారితీసిందని, దీనికితోడు రిస్క్‌ తీసుకునే సామర్థ్యం పెరగడం మార్కెట్లోకి కొత్త ఇన్వెస్టర్ల రాకకు సాయపడినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది తెలిపారు. ప్రజల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల అవగాహన పెరగడం, ప్రచార కార్యక్రమాలు, సమాచారం సులభంగా అందుబాటులోకి రావడం, డిజిటలైజేషన్‌ పెరగడం, మహిళల భాగస్వామ్యం ఫోలియోలు పెరిగేందుకు కారణాలుగా ఎల్‌ఎక్స్‌ఎంఈ ఎండీ ప్రీతిరాతి గుప్తా పేర్కొన్నారు. అలాగే, సంప్రదాయ సాధనాల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు చూడడం పెరిగినట్టు చెప్పారు.

ఎల్‌ఎక్స్‌ఎంఈ అన్నది కేవలం మహిళల కోసమే ఉద్దేశించిన తొలి ఫైనాన్షియల్‌ ప్లాట్‌ఫామ్‌ కావడం గమనించాలి. మొత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తుల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా ఈ ఏడాది మార్చి నాటికి 55.2 శాతంగా ఉంటే, ఆగస్ట్‌ చివరికి 56.6 శాతానికి చేరింది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్‌ పెట్టుబడికి ఒక ఖాతా ఉంటుంది. ఒక ఇన్వెస్టర్‌కు ఒకే మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ పరిధిలో ఒకటికి మించిన పథకాల్లో పెట్టుబడులు ఉండొచ్చు. కనుక ఒకే ఇన్వెస్టర్‌కు ఎక్కువ సంఖ్యలో ఖాతాలు ఉంటాయి.

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

మరిన్ని వార్తలు