Mutual funds:రూ.36.74 లక్షల కోట్లకు చేరిన మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు

9 Oct, 2021 08:09 IST|Sakshi

ముంబై: మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు మరింత మంది ఇన్వెస్టర్లు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.36.74లక్షల కోట్లకు చేరాయి. 2020 సెప్టెంబర్‌ నాటికి ఫండ్స్‌ నిర్వహణ ఆస్తులు రూ.27.6 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 33 శాతం వృద్ధి చెందినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ రూపంలో (సిప్‌) వచ్చే నెలవారీ పెట్టుబడులు మొదటిసారి రూ.10,000 కోట్లను దాటినట్టు యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌ తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్, గోల్డ్, రియల్‌ ఎస్టేట్‌ వంటి సాధనాలతో పోలిస్తే మ్యూచువల్‌ ఫండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.  

సిప్‌ ఖాతాల్లో వృద్ధి.. 
సిప్‌ ఖాతాల సంఖ్య ఆగస్ట్‌ చివరికి 4,32,44,048గా ఉంటే.. సెప్టెంబర్‌ ఆఖరుకు 4,48,97,602 కోట్లకు పెరిగాయి. సిప్‌ రూపంలో సెప్టెంబర్‌లో నికరంగా రూ.10,315 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం మీద సిప్‌ ఖాతాలకు సంబంధించి నిర్వహణ ఆస్తులు రూ.5,44,976 కోట్లకు పెరిగాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల ఆస్తులు మొత్తం పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల్లో 48.23 శాతానికి చేరి.. రూ.17,72,049 కోట్లుగా ఉన్నాయి.   

మరిన్ని వార్తలు