Mutual Funds పెట్టుబడులు ఈ విషయాలు తెలుసా మీకు?

12 Sep, 2022 12:07 IST|Sakshi

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడికి ‘క్యాన్‌’ కావాలా? 

మ్యూచువల్‌ ఫండ్స్‌లో కామన్‌ అకౌంట్‌ నంబర్‌ (క్యాన్‌) అంటే ఏమిటి? ఇందులో అనుకూల, ప్రతికూలతలు ఏమున్నాయి? ఇన్వెస్టర్లు దీని కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరా? -దిలీప్‌ సాహి 

కామన్‌ అకౌంట్‌ నంబర్‌/క్యాన్‌ అనేది ఎంఎఫ్‌ యుటిలిటీస్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న వారికి ఇచ్చే ఏకీకృత ఖాతా. ఇది మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి అన్ని రకాల లావాదేవీలను నిర్వహించే వేదిక. 2015లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు అన్నీ కలసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పంపిణీదారుల సౌకర్యం, సులభతర నిర్వహణ దీని ఏర్పాటు ఉద్దేశ్యం. ఈ ప్లాట్‌ఫామ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్లలో పెట్టుబడికి వీలు కల్పిస్తుంది. ఒక ఇన్వెస్టర్‌ వేర్వేరు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు చెందిన పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసేట్టు అయితే, విడివిడిగా లావాదేవీలను నిర్వహించుకోవాలి. ఇందుకోసం ప్రతి ఏఎంసీ వద్ద విడిగా నమోదు చేసుకోవాలి.

2015లో ఎంఎఫ్‌యూ ఏర్పాటు తర్వాత ఇన్వెస్టర్లు ఇందులో క్యాన్‌ తెరిచి వాటన్నింటినీ దీని నుంచే నిర్వహించుకునే ఏర్పాటు అందుబాటులోకి వచ్చింది. ఏ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలో ఇన్వెస్ట్‌ చేసినా క్యాన్‌కు మ్యాపింగ్‌ చేసుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులన్నింటినీ ఈ ఖాతానుంచే చూసుకోవచ్చు. నిర్వహించుకోవచ్చు. తాజా పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణలు,  కాంటాక్టు వివరాల్లో మార్పులు అన్నీ కూడా క్యాన్‌లో చేసుకుంటే సరిపోతుంది. క్యాన్‌ను కలిగి ఉండడం తప్పనిసరి కాదు. ఎంఎఫ్‌ యుటిలిటీ ద్వారానే ఇన్వెస్ట్‌ చేయాలని లేదు. ఇదొక వేదిక మాత్రమే. ఆ తర్వాత కాలంలో ఎన్నో ఫిన్‌టెక్‌ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవైసీ పూర్తి చేసి ఉండాలి. పాన్, ఫొటో, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆదాయ మూలం తదితర వివరాలతో ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థను లేదా క్యామ్స్‌ తదితర ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లను సంప్రదించి కేవైసీ నమోదు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పంపిణీదారుల ద్వారా కూడా చేసుకోవచ్చు.

ఈటీఎఫ్‌లకు సంబంధించి డివిడెండ్లు నా బ్యాంకు ఖాతాకు జమ అవుతాయా? పన్ను ఎలా లెక్కిస్తారు?  -శరణ్‌ 
డివిడెండ్లు అన్నవి కంపెనీ నుంచి వాటాదారులకు అందే లాభాలు. మన దేశంలో ఈటీఎఫ్‌లు ఇన్వెస్టర్లకు డివిడెండ్లు చెల్లించడం లేదు. దీనికి బదులు డివిడెండ్‌ రూపంలో కంపెనీల నుంచి వచ్చిన మొత్తాన్ని ఈటీఎఫ్‌లు తిరిగి అదే పథకంలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఇటువంటి సందర్భాల్లో బెంచ్‌మార్క్‌ రాబడులకు, ఈటీఎఫ్‌ రాబడులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఈటీఎఫ్‌లు బెంచ్‌మార్క్‌ను అనుసరించే ఇన్వెస్ట్‌ చేస్తాయి. కనుక ఈ రెండింటి మధ్య డివిడెండ్ల రూపంలో వచ్చిన రాబడుల వ్యత్యాసాన్ని ట్రాకింగ్‌ ఎర్రర్‌గా పరిగణిస్తారు. ‘గతంలో ఈటీఎఫ్‌లు ఇన్వెస్టర్లకు డివిడెండ్లు ప్రకటించేవి. కానీ, ఇప్పుడు కేవలం లిక్విడ్‌ ఈటీఎఫ్‌ల వరకే ఇన్వెస్టర్లకు డివిడెండ్‌ ప్రకటిస్తున్నాయి. వారి ఖాతాల్లో జమ చేస్తున్నాయి’అని ఓ ప్రముఖ ఫండ్‌ హౌస్‌ సీనియర్‌ అధికారి ఈ విషయంలో సమాచారాన్ని తెలియజేశారు. ఇక డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం 2020-21 తర్వాత నుంచి ఇన్వెస్టర్ల ఆదాయంగా పరిగణించి పన్ను అమలు చేస్తున్నారు. ఇన్వెస్టర్‌ ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి.


ధీరేంద్ర కుమార్‌, సీఈఓ వాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు