Mutual Funds: నూతన పథకాల వరద

23 May, 2022 01:05 IST|Sakshi

2021–22లో 176 ఎన్‌ఎఫ్‌వోలు

రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో 176 నూతన పథకాలను (ఎన్‌ఎఫ్‌వో) ఆవిష్కరిం చాయి. వీటి రూపంలో రూ.1.07,896 కోట్లను ఇన్వెస్టర్ల నుంచి అవి సమీకరించాయి. దాదాపు అన్ని కేటగిరీల్లో ఏఎంసీలు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించాయి. 2020–21 సంవత్సరంలో ఏఎంసీలు 84 కొత్త పథకాల రూపంలో రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. వీటితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాల ఆవిష్కరణ రెట్టింపు కాగా.. సమీకరించిన మొత్తం ఒకటిన్నర రెట్లు ఉన్నట్టు తెలుస్తోంది.  

పరిస్థితులు భిన్నం..
సాధారణంగా మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు, బుల్లిష్‌ సెంటిమెంట్‌ ఉన్నప్పుడు ఏఎంసీలు కొత్త పథకాలు తీసుకొస్తుంటాయి. దీనివల్ల నిధుల సమీకరణ వాటికి సులభంగా ఉంటుంది. 2020 మార్కెట్‌ క్రాష్‌ తర్వాత మళ్లీ పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగడం.. ఏఎంసీలకు కలిసొచ్చింది. దీంతో అవి పెద్ద మొత్తంలో పథకాలను తీసుకొచ్చాయి. మరోవైపు ఇన్వెస్టర్లకు సానుకూలించే కొన్ని చర్యలను కూడా సెబీ అమల్లోకి తీసుకురావడం గురించి చెప్పుకోవాలి. ఎగ్జిట్‌ లోడ్‌ను తీసేసింది. ఎక్స్‌పెన్స్‌ రేషియోపై పరిమితులు విధించింది. పథకాల విభాగాల్లో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఫ్లెక్సీక్యాప్‌ తదితర కొత్త విభాగాలను ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే చర్యలను కూడా అమలు చేసింది. ఇవి కూడా అనుకూలించినట్టు చెప్పుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడుల విధానం, సెబీ, యాంఫి తీసుకున్న చర్యలు విభిన్న విభాగాల్లో పెద్ద ఎత్తున ఎన్‌ఎఫ్‌వోల ప్రారంభానికి దారితీసినట్టు ఫయర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ గోపాల్‌ కావలిరెడ్డి చెప్పారు.

ఇండెక్స్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ  
ఎక్కువగా ఇండెక్స్, ఈటీఎఫ్‌ విభాగాల్లో ఎన్‌ఎఫ్‌వోలు వచ్చాయి. ఇండెక్స్‌ ఫండ్‌ విభాగంలో 49 కొత్త పథకాలను ఏఎంసీలు ప్రారంభించాయి. ఇవి రూ.10,629 కోట్లు సమీకరించాయి. ఈటీఎఫ్‌ విభాగంలో 34 ఎన్‌ఎఫ్‌వోలు రూ.7,619 కోట్లు, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్లాన్ల విభాగంలో 32 కొత్త పథకాలు రూ.5,751 కోట్లు సమీకరించాయి. విదేశీ ఫండ్స్‌ రూపంలో రూ.5,218 కోట్లు, 11 సెక్టోరల్‌ లేదా థీమ్యాటిక్‌ ఫండ్స్‌ రూపంలో రూ.9,127 కోట్లు ఇన్వెస్టర్ల నుంచి ఆకర్షించాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఇప్పటి వరకు నాలుగు ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రాగా, ఇవి రూ.3,307 కోట్లు సమీకరించాయి. మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుండడం, వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో స్టాక్‌ మార్కెట్లలో దిద్దుబాటు, స్థిరీకరణ చూస్తూనే ఉన్నాం. దీనికితోడు ఇంటి నుంచి పనికి బదులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులతో ఇక మీదట ఎన్‌ఎఫ్‌వోలకు ఆదరణ తగ్గొచ్చని ఫయర్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ గోపాల్‌ కావలిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్లు (ఎఫ్‌ఎంపీలు) విభాగంలో పథకాల ఆవిష్కరణ ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు.

మరిన్ని వార్తలు