ఫండ్స్‌లో వరుసగా ఆరో నెలా అమ్మకాలే

7 Dec, 2020 05:27 IST|Sakshi

నవంబర్‌లో ఈక్విటీల నుంచి రూ. 30,760 కోట్ల ఉపసంహరణ

మార్కెట్లు రికార్డు స్థాయికి చేరడంతో లాభాల స్వీకరణ

న్యూఢిల్లీ: మార్కెట్లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో వరుసగా ఆరో నెలా మ్యూచువల్‌ ఫండ్స్‌లో (ఎంఎఫ్‌) అమ్మకాలు కొనసాగాయి. నవంబర్‌లో ఈక్విటీల నుంచి 30,760 కోట్ల పెట్టుబడులను ఫండ్స్‌ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. సెబీ గణాంకాల ప్రకారం జూన్‌ నుంచి ఇప్పటిదాకా రూ. 68,400 కోట్ల పెట్టుబడులు ఉపసంహరణ జరిగింది. అయితే, ఇతరత్రా వచ్చిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తొలి 11 నెలల్లో (జనవరి–నవంబర్‌) నికరంగా రూ. 28,000 కోట్లు వెనక్కి తీసుకున్నట్లయింది. ఇదే వ్యవధిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ. 1.08 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేశారు.

ఫలితంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ విక్రయాలు ఎలా ఉన్నప్పటికీ ఎఫ్‌పీఐల ఊతంతో మార్కెట్లు గత కొద్ది నెలలుగా పెరుగుతూనే వచ్చాయి. ‘మార్కెట్లు కొత్త గరిష్టాలకు చేరడం, నిఫ్టీ వేల్యుయేషన్‌ 36 రెట్ల స్థాయికి చేరడం వంటి అంశాల కారణంగా లాభాల స్వీకరణ జరుగుతోంది. సెప్టెంబర్‌–అక్టోబర్‌తో పోలిస్తే పెట్టుబడుల ఉపసంహరణ మరింతగా పెరగడం ఇందుకు నిదర్శనం‘ అని ప్రైమ్‌ఇన్వెస్టర్‌డాట్‌ఇన్‌ సహ వ్యవస్థాపకురాలు విద్యా బాల తెలిపారు. ఈక్విటీ మార్కెట్‌లో కొంత కరెక్షన్‌ వచ్చే దాకా ఈ ధోరణి కొనసాగవచ్చని ఆమె పేర్కొన్నారు. మార్కెట్లు కరెక్షన్‌కు లోనైనా, దీర్ఘకాలికంగా ఆర్థిక వృద్ధి పుంజుకుంటోందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపించినా ఫండ్లు మళ్లీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలుపెట్టొచ్చని మార్నింగ్‌స్టార్‌ ఇండియా డైరెక్టర్‌ కౌస్తుభ్‌ బేలాపూర్కర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు