Naaptol IPO: అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే నాప్‌టాల్‌ సంచలన నిర్ణయం..!

31 Jan, 2022 12:34 IST|Sakshi

అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే టెలిషాపింగ్‌, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం నాప్టోల్‌(Naaptol Online Shopping Pvt. Ltd) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీవో ద్వారా నిధులను సేకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

రూ. 1,000 కోట్లే లక్ష్యంగా..!
నాప్టోల్ ఆన్‌లైన్ షాపింగ్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఐపీవో ద్వారా 1,000 కోట్ల నిధులను సమీకరించేందుకు ప్రణాళికలను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఐపీవో ప్రణాళికలను కంపెనీ చెందిన ప్రముఖ వ్యక్తులు వెల్లడించారు. నాప్టోల్‌ ఇప్పటికే ఐపీవోకి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఆనంద్ రాఠి సలహాలను ఇస్తున్నాయి. కంపెనీకి చెందిన ప్రతిపాదిత ఐపీవో ప్రాథమిక, ద్వితీయ వాటా విక్రయాలు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీకి ఇప్పటికే ఉన్న కొంతమంది ఇన్వెస్టర్లు ఐపీవోలో తమ షేర్లలో కొంత భాగాన్ని అమ్మే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే తాజా నిధుల సేకరణ దాని బ్యాక్-ఎండ్, ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాప్టోల్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మను అగర్వాల్ కంపెనీ ఐపీవో ప్రణాళికలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

తక్కువ ధరలకే..!
అతి తక్కువ ధరలకే వస్తువులను అందిస్తూ నాప్టోల్‌ టెలిషాపింగ్‌ మార్కెట్‌లో భారీ ఆదరణనే పొందింది. 2008లో పలు ఉత్పత్తుల ఆవిష్కరణ కోసం మొదటిసారి టీవీ చానల్‌ను కంపెనీ స్థాపించింది. వినూత్నమైన ప్రచారంతో ఆయా ఉత్పత్తులను సేల్‌ చేస్తోంది. హిందీతో పాటుగా స్థానిక భాషలు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా బహుళ భాషలలో టీవీ ఛానెల్‌ల ద్వారా ఉత్పత్తులను సేల్‌ చేస్తోంది.

గత ఏడాది ఫ్లాట్‌గా..!
జపాన్‌కు చెందిన Mitsui & Co., జేపీ మోర్గాన్‌,  వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ న్యూ ఎంటర్‌ప్రైజ్ అసోసియేట్స్ వంటి పెట్టుబడిదారుల మద్దతు నాప్టోల్‌కు ఉంది. వీరి నుంచి 2018లో 15 మిలియన్‌ డాలర్లను, 2015లో 51.7 మిలియన్‌ డాలర్లను నాప్టోల్‌ సేకరించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి నాప్టోల్‌ ఫ్లాట్‌గా రాబడిని చూసినప్పటికీ, మునుపటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలతో పోలిస్తే మార్జినల్‌ లాభాలను పొందగలిగింది. ఇది FY20లో రూ. 321.22 కోట్ల నుంచి, FY21లో రూ. 318.87 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది .అయినప్పటికీ, ఇది FY20లో రూ. 51.84 కోట్ల నష్టం నుంచి FY21లో రూ. 3.42 కోట్ల లాభానికి తన కార్యకలాపాలను మార్చగలిగింది.

చదవండి: ఐపీఓకి ముందు ఎల్‌ఐసీ కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు