అదిరిపోయిన హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. ధరెంతో తెలుసా?

17 Mar, 2022 16:45 IST|Sakshi

హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నహక్ మోటార్స్ తన నహక్ పీ-14 హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్'ను ఇక నుంచి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అని ప్రకటించింది. అయితే, ప్రీ బుకింగ్స్ విండో మార్చి 15 నుండి మార్చి 30 వరకు ఓపెన్ చేసి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి MRP 10% డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మే నెల నుంచి బైక్ డెలివరీ చేయలని యోచిస్తోంది.

నహక్ పీ-14 ఎలక్ట్రిక్ బైక్ ధర 2.49 లక్షలు(ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ అధికారిక పోర్టల్ రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. నహక్ మోటార్స్ తమ పీ-14 ఎఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ను తొలిసారిగా ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించారు. ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. పెర్ఫార్మెన్స్ విషయంలో ఇది ప్రస్తుత సాంప్రదాయ పెట్రోల్ వాహనాలకు ఏమాత్రం తీసిపోదన్నమాట. నిజానికి ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఇదొక గొప్ప టాప్ స్పీడ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

నహక్ పి-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైకులో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీని ఇంట్లోనే హోమ్ ప్లగ్ సాయంతోనే ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ఛార్జర్‌ ద్వారా ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల సమయం పడితే.. ఫాస్ట్ చార్జర్ సహాయంతో 30 నిమిషాల్లో దీనిని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్, భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ అని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో 72v 60Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

ఈ బైకులో లభించే ప్రధాన ఫీచర్లను గమిస్తే, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ బాడీ లైన్స్, పూర్తి బాడీ ప్యానెల్స్, డిజిటల్ స్పీడోమీటర్, మిడ్-మౌంటెడ్ బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్, ముందు వైపు డ్యూయెల్ డిస్క్, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్స్, ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్, 150 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే,  ఈ బైక్ రేంజ్ ఎంత పేర్కొనకపోవడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. 

(చదవండి: దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు.. !)

>
మరిన్ని వార్తలు