ఈవీ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ మోపెడ్.. కి.మీ.కు 25 పైసలు మాత్రమే!

9 Mar, 2022 18:06 IST|Sakshi

ఫరీదాబాద్ నగరానికి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ నహక్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్'ను ఈరోజు దేశంలో లాంఛ్ చేసింది. కొత్త నహక్ మోటార్స్ ఎగ్జిటో సోలో ఎలక్ట్రిక్ మోపెడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.85,999గా ఉంది. ఇది 100 శాతం మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ మోపెడ్. ఈ స్కూటర్ మీద కి.మీ. ప్రయాణానికి 25 పైసలు మాత్రమే ఖర్చు కానున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ కోసం ప్రీ బుకింగ్స్ వచ్చే నెలలో కంపెనీ అధికారిక పోర్టల్లో ప్రారంభమవుతాయని నహక్ మోటార్స్ తెలిపింది. 

అంతేకాక, డెలివరీలు వచ్చే నెల నుంచి పాన్-ఇండియా డీలర్ షిప్ ద్వారా ప్రారంభమవుతాయని కూడా పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్'ను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపయోగించడానికి రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ 150 కిలోగ్రాముల వరకు పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 48వీ 30 ఏహెచ్ బ్యాటరీ చేత పనిచేస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు 5 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. దీని ఛార్జర్'ను రెగ్యులర్ హోమ్ పవర్ సాకెట్'లో ప్లగ్ చేయవచ్చు.

(చదవండి: ఇక సామాన్యులు బంగారం కొనడం కష్టమేనా..!)

మరిన్ని వార్తలు