సరికొత్త రికార్డు.. కంపెనీ ప్రారంభమయ్యాక ఇదే ఫస్ట్‌టైం!

24 Sep, 2022 07:36 IST|Sakshi

2021–22లో రూ. 2,952 కోట్లు 

అమ్మకాలు, ఉత్పత్తిలోనూ కొత్త చరిత్ర  

భువనేశ్వర్‌: ప్రభుత్వ రంగ మెటల్‌ కంపెనీ నేషనల్‌ అల్యూమినియం(నాల్కో) గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రికార్డ్‌ లాభాలు ఆర్జించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 2,952 కోట్ల లాభం ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం అమ్మకాలు సైతం కొత్త గరిష్టాన్ని సాధిస్తూ రూ. 14,181 కోట్లకు చేరాయి. ఈ బాటలో కంపెనీ అల్యూమినియం క్యాస్ట్‌ మెటల్‌ ఉత్పత్తి 4,60,000 టన్నులను తాకింది.

ఇది సరికొత్త రికార్డుకాగా.. కంపెనీ ప్రారంభమయ్యాక తొలిసారి 100 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకుంది. నాల్కో ప్రస్థానంలో గతేడాది చరిత్రాత్మకమని వార్షిక వాటాదారుల సమావేశంలో కంపెనీ సీఎండీ శ్రీధర్‌ పాత్ర పేర్కొన్నారు. అత్యుత్తమ ఫలితాలు కంపెనీ పటిష్ట పనితీరుకు దృష్టాంతమని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి సవాళ్లలోనూ ఉద్యోగులంతా కీలకపాత్ర పోషించినట్లు ప్రశంసించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడివ్యయాలు, బొగ్గు సంక్షోభం, ఎల్‌ఎంఈ ధరల్లో అనిశ్చితి తదితరాల మధ్య కూడా ప్రపంచంలోనే బాక్సైట్, అల్యూమినా చౌక తయారీదారుగా కంపెనీ నిలిచినట్లు ప్రస్తావించారు.

చదవండి:  TCS Work From Home Ends: టీసీఎస్‌ భారీ షాక్‌.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!

     

మరిన్ని వార్తలు