CSIR: టాప్‌ సైంటిఫిక్‌ బాడీకి తొలి మహిళా హెడ్‌గా కలైసెల్వి రికార్డు

7 Aug, 2022 12:33 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి  మహిళా సైంటిస్టుగా రికార్డు సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు దేశవ్యాప్తంగా 38 పరిశోధనా సంస్థల కన్సార్టియం  కీలక బాధత్యలను చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. 2019 ఫిబ్రవరిలో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CECRI)కి సారథ్యం వహించిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా అవతరించిన ఘనత కూడా కలైసెల్వికే దక్కింది.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్‌గా కలైసెల్వి  శనివారం నియమితు లయ్యారు.  ఆమె నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి రెండేళ్ల కాలం, లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా అయితే అది అమలులో ఉంటుందని మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు.

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అంబాసముద్రం అనే చిన్న పట్టణానికి చెందిన వారు కలైసెల్వి. లిథియం అయాన్ బ్యాటరీ రంగంలో  విశేష కృషి చేసిన  ఆమె  ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో ఉన్న సెంట్రల్ ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో ఎంట్రీ లెవల్ సైంటిస్ట్‌గా కరియర్‌ను ప్రారంభించడం విశేషం. 125కిపైగా ఎక్కువ పరిశోధనా పత్రాలు, ఆరు పేటెంట్లు ఆమె ఖాతాలోఉన్నాయి. పురుషాధిపత్య సవాళ్లను అధిగమించి అనేక ఉన్నత పదవులను చేపట్టిన కలైసెల్వి తాజాగా మరో అత్యున్నత సంస్థకు హెడ్‌గా ఎంపిక కావడంపై  నారీశక్తి అంటూ పలువురు అభినందనలు ప్రకటిస్తున్నారు.

మరిన్ని వార్తలు