ఆస్కార్‌ అవార్డ్‌ వేడుకలో తళుక్కున మెరిసిన ఇండియన్‌ ఇంజనీర్‌..!

28 Mar, 2022 19:40 IST|Sakshi

ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్‌. 94 వ అకాడమీ అవార్డ్స్‌ వేడుక అట్టహాసంగా కొనసాగింది. ఇక ఈ వేడుకల్లో భారత్‌కు ఎలాంటి అవార్డులు దక్కలేదు. కానీ భారత్‌కు చెందిన వీఎఫ్‌ఎక్స్‌ ఇంజనీర్‌ ప్రతిభతో ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం డూన్‌ (Dune) బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు వరించింది. ఈ సినిమాకు బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు వచ్చేలా తన ప్రతిభతో మెప్పించిన ఇండియన్‌ గురించి తెలుసుకుందాం..

నమిత్‌ మల్హోత్రా..
భారత్‌కు చెందిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఇంజనీర్ నమిత్ మల్హోత్రా మార్చి 28 సోమవారం జరిగిన ఆస్కార్‌ అవార్డుల వేడుకల్లో బెస్ట్‌ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో 2022 ఆస్కార్ అవార్డును ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ డూన్ గెలుచుకున్న తర్వాత అందరి దృష్టిని ఆకర్షించాడు. నమిత్‌ మల్హోత్రా విజయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ట్వీట్ చేశారు. డూన్‌ సినిమాకు డబుల్‌ నెగటివ్‌(DNEG) అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌ను రూపొందించింది. ఈ సంస్థకు సీఈవోగా నమిత్‌ మల్హోత్రా వ్యవహారిస్తున్నారు. బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు వచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు. 

డైలీ సీరియల్స్‌ నుంచి ఆస్కార్‌ అవార్డు వరకు..
నమిత్‌ మల్హోత్రా బాలీవుడ్ దర్శకుడు,నిర్మాత నరేష్ మల్హోత్రా పెద్ద కుమారుడు. ఆయన పూర్తిగా ముంబైలో పెరిగారు. హెచ్‌ఆర్‌ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకొని,జీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్ ప్లస్ వంటి ఛానెల్స్‌లో సీరియల్స్ కోసం పని చేస్తూ...ఎడిటింగ్ స్టూడియో వీడియో వర్క్‌షాప్‌ను నమిత్‌ మల్హోత్రా ప్రారంభించారు. ఈ సంస్థను వీడియో వర్క్స్‌తో విలీనం చేయగా తరువాత ప్రైమ్‌ ఫోకస్‌ అనే వీఎఫ్‌ఎక్స్‌ సంస్థను స్థాపించారు.ఈ సంస్థ 16 నగరాల్లో 8,000 మంది నిపుణులతో గ్లోబల్ (ప్రైమ్ ఫోకస్ వరల్డ్)గా మారింది. 2డీ చిత్రాలను 3డీ చిత్రాలుగా మార్చడంలో అద్బుత విజయం సాధించింది. 2014లో ప్రైమ్‌ ఫోకస్‌ వరల్డ్‌ను బ్రిటన్‌కు చెందిన డబుల్‌ నెగటివ్‌ సంస్థలో వీలినం చేశారు. 

ఎన్నో చిత్రాలకు..!
నమిత్‌ మల్హోత్రా నేతృత్వంలోని డబుల్‌ నెగటివ్‌ అనేక ప్రతిష్టాత్మక చిత్రాలను రూపొందించింది. డబుల్‌ నెగటివ్‌ ఇంత ఘన విజయం సాధించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలి కాలంలో విడుదలైన టెనెట్, బ్లేడ్ రన్నర్ 2049, ఫస్ట్ మ్యాన్, ఎక్స్ మెషినా, ఇంటర్‌స్టెల్లార్ ,ఇన్‌సెప్షన్ చిత్రాలకు ఆస్కార్‌ అవార్డులు లభించాయి. ఇక ఈ సంస్థ  హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ (రెండు భాగాలు), ష్రెక్ 2 , వ్రాత్ ఆఫ్ ది టైటాన్స్, కొన్ని స్టార్ వార్స్ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ను అందించారు. అంతేకాకుండా ఇటీవల రిలీజైన జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై చిత్రానికి కూడా వీఎఫ్‌ఎక్స్‌ను రూపొందించింది. 

చదవండి: అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్‌..! ట్రయంఫ్‌ నుంచి..!

మరిన్ని వార్తలు