ఫైర్‌ సెఫ్టీ యాక్ట్‌లో మార్పులు చేయండి - నరెడ్కో విజ్ఞప్తి

7 May, 2022 12:20 IST|Sakshi

21 మీటర్ల ఎత్తు వరకూ అనుమతించండి! 

నరెడ్కో వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ విన్నపం 

సాక్షి, హైదరాబాద్‌: 21 మీటర్ల ఎత్తు భవనాలకు కూడా  అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఈ మేరకు ఫైర్‌ సేఫ్టీ యాక్ట్‌లో సవరణలు చేయాలని నరెడ్కో వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ జీహెచ్‌ఎంసీకి లేఖ రాసింది. ప్రస్తుతం 18 మీటర్ల ఎత్తు (సెల్లార్‌ + స్టిల్ట్‌ + 5 అంతస్తులు) భవనాలకు ఫైర్‌ ఎన్‌ఓసీ నుంచి మినహాయింపు ఉందని.. అదనంగా 3 మీటర్ల ఎత్తును అనుమతి ఇస్తే ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌)లకు డిమాండ్‌ పెరుగుతుందని అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎం.ప్రేమకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం 900 గజాలు దాటిన భవనాలు సెల్లార్‌ +  స్టిల్ట్‌ + 5 ఫ్లోర్లు వేసుకోవచ్చు. భవనం ఎత్తు పెంచడంతో టీడీఆర్‌ వినియోగించుకొని అదనంగా 6వ అంతస్తుతో పాటు సెల్లార్‌కు బదులుగా రెండు స్టిల్ట్‌లు వేసుకునే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. సెల్లార్‌ తవ్వకంతో కాలుష్యం పెరగడంతో పాటూ చుట్టుపక్కల వారితో నిత్యం ఏదో ఒక గొడవలు, ఇబ్బందులు జరుగుతున్నాయని తెలిపారు.  

- నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) ప్రకారం భవనం ఎత్తు 15 మీటర్లకు పరిమితి చేసిన సమయంలో ఏపీ ఫైర్‌ సర్వీస్‌ చట్టం–1999 సెక్షన్‌ 13లోని భవనం ఎత్తు 18 మీటర్ల వరకు సవరించిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 17.5 మీటర్ల ఎత్తు ఉన్న భవనాలు కూడా హైరైజ్‌ గానే భావిస్తుందని, దీన్ని పరిగణనలోకి తీసుకొని ఫైర్‌ సేఫ్టీ యాక్ట్‌లో బిల్డింగ్‌ హైట్‌ను 21 మీటర్లకు పెంచాలని సూచించారు. 
-    రోడ్డు వెడల్పును బట్టి 18 అంతస్తుల వరకు ఎకరానికి ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ)ను 1.75 లక్షల చ.అ.లకు పరిమితం చేయాలని సూచించారు. అదనపు అంతస్తులు అవసరం ఉన్న వాళ్లు టీడీఆర్‌లు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) వచ్చిన 6 నెలల తర్వాతి నుంచే ప్రాపర్టీ ట్యాక్స్‌ను వసూలు చేయాలని కోరారు.   

చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు