మొబైల్‌ టెక్నాలజీతో టీకాలు..

9 Dec, 2020 03:40 IST|Sakshi

5జీ సేవల ప్రారంభానికి సమిష్టి ప్రయత్నాలు 

టెలికం పరికరాల హబ్‌గా భారత్‌ ఎదగాలి 

ఐఎంసీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారీ స్థాయిలో చేపట్టనున్న కోవిడ్‌–19 టీకాల కార్యక్రమంలో మొబైల్‌ టెక్నాలజీని వినియోగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అనేక రెట్లు వేగవంతమైన డేటా సర్వీసులను అందించగలిగే 5జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ను సత్వరం అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం అంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ‘కోట్ల మందికి కోట్ల కొద్దీ రూపాయల ప్రయోజనాలను చేకూర్చేందుకు మొబైల్‌ టెక్నాలజీ తోడ్పడుతోంది. అసంఖ్యాకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఉపయోగపడుతోంది. దీని తోడ్పాటుతోనే ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో కోవిడ్‌–19 టీకాలను వేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, టీకాలు వేయడంలో మొబైల్‌ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించబోతున్నారన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇక టెలికం పరికరాలు, డిజైన్, అభివృద్ధి, తయారీకి భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంతా కలిసి పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశీయంగా టెలికం పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టామని, మొబైల్స్‌ తయారీకి కీలకమైన దేశాల్లో ఒకటిగా భారత్‌ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.  

మూడేళ్లలో గ్రామాలన్నింటికీ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ.. 
అన్ని గ్రామాలకు మూడేళ్లలో అత్యంత వేగవంతమైన ఫైబర్‌ ఆప్టిక్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ అయ్యే కొద్దీ హ్యాండ్‌సెట్స్, గ్యాడ్జెట్స్‌ను తరచూ మార్చేసే సంస్కృతి కూడా పెరుగుతోందని, ఇలాంటి ఎల్రక్టానిక్‌ వ్యర్థాల నిర్వహణకు పరిశ్రమ ప్రత్యేకంగా టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. భారత డిజిటల్‌ మార్కెట్‌ పరిమాణం, అవసరాలు అసాధారణ స్థాయిలో ఉన్నాయని ప్రధాని తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం ఏర్పాటైన మొబైల్‌ యాప్‌లు.. అనేక దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ కంపెనీలను దాటేస్తున్నాయి. ఇది భారత్‌కు, మన యువ ఆవిష్కర్తలకు శుభసూచకం. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు అవకాశమున్న ఎన్నో వినూత్న ఆవిష్కరణలపై మన యువత పనిచేస్తోంది‘ అని ఆయన పేర్కొన్నారు.  

ఎఫ్‌డీఐలకు వ్యతిరేకం కాదు: టెలికం మంత్రి ప్రసాద్‌ 
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ ఆవిష్కరణలను స్వాగతిస్తామని .. అయితే దేశ భద్రత రీత్యా దేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. ఉగ్రవాదులు దుర్వినియోగం చేయకుండా.. డిజిటల్‌ టెక్నాలజీలు సురక్షితంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భద్రతా కారణాల రీత్యా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌ తదితర చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో ప్రసాద్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రత్యేక ప్రమాణాలు వద్దు: ఎయిర్‌టెల్‌ సీఈవో 
5జీ సేవలకు సంబంధించి భారత్‌ కోసం ప్రత్యేక ప్రమాణాలు నిర్దేశించాలన్న యోచన అంత శ్రేయస్కరం కాదని భారతి ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విఠల్‌ అభిప్రాయపడ్డారు. దీనివల్ల అంతర్జాతీయ వ్యవస్థలో భారత్‌ భాగమయ్యే అవకాశాలు లేకుండా పోతాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా కొత్త ఆవిష్కరణల అభివృద్ధి ప్రక్రియ మందగించే అవకాశం ఉందన్నారు. అటు టెలికం కంపెనీలు.. టారిఫ్‌లు, పన్నులు, స్పెక్ట్రం కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వొడాఫోన్‌ ఐడియా సీఈవో రవీందర్‌ టక్కర్‌ తెలిపారు.  ఇక, స్పెక్ట్రం ధరలను భారత్‌ తగ్గించాలని, లభ్యతను పెంచాలని స్వీడన్‌ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్‌ ఆగ్నేయాసియా  హెడ్‌ నుంజియో మిరి్టలో పేర్కొన్నారు. మరింత మందికి వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నామని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాన్‌ రాబినోవిట్జ్‌ వెల్లడించారు.   

మరిన్ని వార్తలు