Nasa Evtol Aircraft: ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీలపై నాసా ప్రయోగాలు

5 Sep, 2021 11:44 IST|Sakshi

ఆల్‌ ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేక్‌ఆఫ్‌ అండ్‌ లాండింగ్‌(ఇవీటీఓఎల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌.. పేరు వినగానే ఏదో భారీ యుద్ధ విమానం అనుకుంటున్నారా! అదేం కాదు. టేకాఫ్‌ అవసరం లేకుండా గాల్లోకి నేరుగా ఎగరే, లాండయ్యే విమానం, అది కూడా కరెంటుతో నడిచేదాన్ని ఇవీటీఓఎల్‌ అంటారు. తాజాగా అమెరికాకు చెందిన నాసా ఈ వాహనాలపై జోబీ ఏవియేషన్‌తో కలిసి ప్రయోగాలు ఆరంభించింది. 

ప్రయోగాలు సఫలమైతే త్వరలో ఎయిర్‌టాక్సీలు అమెరికన్లకు అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఏఏఎం(అడ్వాన్డ్స్‌ ఎయిర్‌ మొబిలిటీ) నేషనల్‌ కాంపైన్‌లో భాగంగా ఈ వాహనాలపై నాసా5 ప్రయోగాలు ఆరంభించింది. జోబీకి చెందిన ఎలక్ట్రిక్‌ ఎయిర్‌బేస్‌ కాలిఫోర్నియాలో ఉంది. దీనిలో నాసా ప్రయోగాలు జరుపుతోంది. వేగవంతమైన రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే జోబీ తయారుచేసిన ఇవీటీఓఎల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పనితీరును ప్రస్తుతం నాసా మదింపు చేస్తోంది. 

డేటా పరిశీలనతో వచ్చే ఏడాది పలు పరీక్షలు నిర్వహిస్తారు. రాబోయే సంవత్సరాల్లో అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్‌ మొబిలిటీ ప్రయోగాలు జరగనున్నాయని నాసా వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ప్రయోగాల్లో భాగంగా ఎయిర్‌టాక్సీకి 50కి పైగా మైక్రోఫోన్లు అమరుస్తారు. అనంతరం విమానం ఎగురుతున్నప్పటి దశల్లో జరిగే మార్పులను రికార్డు చేస్తారు. నాసా చేపట్టిన కార్యక్రమం భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ వాహనాలకు కీలకమని జోబీ ఏవియేషన్‌ సీఈఓ జోబెన్‌ చెప్పారు. నాసాతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు.

చదవండి: స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు 

మరిన్ని వార్తలు