Nasa DART Mission: దూసుకొచ్చే గ్రహశకలాలు, ఉల్కలను అడ్డుకోగలమా?నాసా ‘డార్ట్‌’ ఏం చేస్తుందో?

24 Nov, 2021 13:34 IST|Sakshi

Nasa Dart Launch:  అది ఫిబ్రవరి 15, 2013. రష్యాలో చలికావడంతో జనాలు దాదాపుగా ఇళ్లకు పరిమితం అయ్యారు. పూర్తి సూర్యోదయం తర్వాత కొన్ని నిమిషాలకు సుమారు 9గంటల 20 నిమిషాల సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం.  ఫైర్‌బాల్‌ లాంటి ఓ భారీ రూపం.. సూర్యుడి కంటే రెట్టింపు కాంతితో యూరల్‌ రీజియన్‌ వైపు దూసుకొస్తోంది. చెల్యాబిన్‌స్క్, కుర్గన్‌తో పాటు మరికొన్ని రీజియన్లలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.  అదేంటో అనుకునేలోపే భారీ శబ్దంతో విధ్వంసం. అయితే..  


అదృష్టవశాత్తూ అది నివాస ప్రాంతాల్లో పడలేదు. కానీ, దాని ప్రభావం వందల కిలోమీటర్ల పరిధిలో చూపించింది. భారీ పేలుడు, దట్టమైన దుమ్ము, ధూళి అలుముకోవడంతో పాటు గన్‌ పౌడర్‌ వాసనతో ఆ రేంజ్‌ మొత్తం కొన్ని రోజులపాటు గుప్పుమంటూనే ఉంది. ప్రజల హాహాకారాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు హోరెత్తాయి.  ఈ బీభత్సం సృష్టించిన ఉల్కకి ఉన్న శక్తి.. షిరోషిమా అణుబాంబు కంటే 30 రెట్లు కలిగి ఉందని తర్వాత నాసా గుర్తించింది.

 

54 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ ఉల్క..  60 అడుగుల వెడల్పు, పదివేల టన్నుల బరువు ఉంది. 1908 టుంగుష్క ఈవెంట్‌ తర్వాత నమోదైన అతిపెద్ద ఘటన ఇదే. 1986లో గ్రేట్‌ మాడ్రిడ్‌ ఉల్కాపాతం ఘటనలో గాయపడిన వాళ్ల సంఖ్యతో పోలిస్తే.. చెల్‌యాబ్నిస్క్‌ ఘటనలో గాయపడిన వాళ్లే ఎక్కువ. ప్రాణ నష్టం లేకపోయినా.. సుమారు 1600 మంది గాయపడ్డారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.


విధ్వంసం తాలుకా ఆనవాలు

ప్రస్తుతం ఆ ప్రాంతం కోలుకున్నా, ఏళ్లు గడుస్తున్నా.. ప్రాణ భయం ఇప్పటికీ అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. అంతరిక్షం నుంచి ఎప్పుడు ఎటు నుంచి ఇలాంటి ముప్పు పొంచి ఉందో అనే ఆందోళన ప్రపంచం మొత్తం నెలకొంది.  ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఇలాంటి ఘటనలు తప్పించేందుకే నాసా ఇప్పుడు డార్ట్‌ను లాంఛ్‌ చేసింది.

గ్రహశకలాలు, ఉల్కలు.. ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే. అంతరిక్షంలో వాటిని స్పేస్‌ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టే ఆలోచనే డార్ట్‌. డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌ మిషన్‌. నాసా ఆధ్వర్యంలో Double Asteroid Redirection Test missionను(DART) నవంబర్‌ 24న(ఇవాళ) ప్రయోగించారు.  భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కాలిఫోర్నియాలోని స్పేస్‌ స్టేషన్‌ నుంచి డార్ట్‌ను లాంఛ్‌ చేశారు. ఇందుకోసం ఎలన్‌ మస్క్‌ ప్రైవేట్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ను ఉపయోగించారు.  

సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని, ఉల్కలను నాశనం చేసేందుకు న్యూక్లియర్‌ వెపన్స్‌ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్‌ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని గ్రహశకలాలు, ఉల్కల సంగతి ఏంటి?.. అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా.  కానీ, వాటిని స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ  NASA.

డిడైమోస్‌(నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్‌) ఆస్టరాయిడ్‌.. దాని చుట్టూరా తిరిగే డైమోర్‌ఫోస్‌(బుల్లి చందమామగా అభివర్ణిస్తుంటారు).. ఈ రెండింటిని నాశనం చేయడమే డార్ట్‌ మిషన్‌ లక్ష్యం. NASA's First Planetary Defense Mission 2022 లేదంటే 2023 మధ్యకల్లా పూర్తవ్వొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది గనుక సక్సెస్‌ అయితే భవిష్యత్తులో ప్రమాదకరమైన గ్రహశకలాలు, ఉల్కాపాతాల నుంచి భూమికి జరిగే డ్యామేజ్‌ను తప్పించొచ్చనేది నాసా ఆలోచన. అయితే asteroid deflection technology ద్వారా భూమిని కాపాడాలనే నాసా ప్రయత్నం గురించి పలువురికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ స్పేస్‌ క్రాఫ్ట్ టార్గెట్‌ రీచ్‌ కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పేస్‌క్రాఫ్ట్‌ గురితప్పదని, గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాత అది నాశనం కాకపోయినా.. కనీసం గమనాన్నైనా మళ్లిస్తుందని నాసా సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

మరిన్ని వార్తలు