నాసా ఉపయోగించే ప్రోగ్రామ్స్ ఇకపై ప్రజలకు...

3 Jul, 2021 18:26 IST|Sakshi

అంతరిక్ష రంగంలో అనేక విజయాలను సాధించిన సంస్థ నాసా. పలు అంతుచిక్కని విషయాలను విశదీకరించడంలో నాసా పాత్ర ఎంతగానో ఉంది. బ్లాక్‌ హోల్స్, ఇతర గెలాక్సీలు, ఇతర గ్రహాలను క్షుణంగా పరిశీలించడానికి అత్యంత శక్తివంతమైన సూపర్‌ కంప్యూటర్లను ఉపయోగిస్తారు. గతంలో నాసా జరిపిన ఈవెంట్‌ హరిజోన్‌లో భాగంగా తొలిసారిగా బ్లాక్‌ హోల్‌ చిత్రాన్ని తీసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం వెనుక ఎంతగానో శ్రమ దాగి ఉంది. ఈవెంట్‌ హరిజోన్‌లో భాగంగా టెలిస్కోప్‌లు గ్రహించిన విషయాలను సూపర్‌ కంప్యూటర్‌తో గణించి చిత్ర రూపంలో తీశారు. కాగా ప్రస్తుతం నాసా కీలక నిర్ణయం తీసుకుంది.

నాసా ఉపయోగించే పలు ఆవిష్కరణలకు ఉపయోగించే సాఫ్టువేర్లను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆవిష్కరణలతో నిజ ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్‌ పెట్టవచ్చునని నాసా పరిశోధకులు ఆశాభావం వ్యక్తంచేశారు. నాసా అధికారిక వెబ్‌ సైట్‌లో సుమారు 800 ప్రోగ్రాంలను అందుబాటులో ఉంచనున్నట్లు ఒక ప్రకటనలో నాసా తెలిపింది. గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నిల్సన్‌ పేర్కొన్నారు.

ఈ ప్రోగ్రామ్స్‌తో ఏరోనాటిక్స్, అటానమస్‌ సిస్టమ్స్, బిజినెస్‌ సిస్టమ్స్, ప్రాజెక్ట్‌ మేనెజ్‌మెంట్‌ , డేటా అండ్‌ ఇమేజ్‌ ప్రాసెసింగ్, డిజైన్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ టల్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ సంబంధించిన వాటికి పరిష్కారం చూపవచ్చునని నాసా భావిస్తోంది. నాసా అందించనున్న 832 ప్రోగ్రామ్స్‌ను ప్రజలకు జూలై 13 న అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేరోజు ఒక వెబినార్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు సులువుగా ప్రోగ్రాంలను ఏవిధంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలనే విషయాలను వివరించనున్నారు.

మరిన్ని వార్తలు