-

ప్రపంచాన్ని ఊపేస్తున్న మెటావర్స్‌ ఫీవర్..వినియోగంలోకి వచ్చేది అప్పుడే!

25 Jan, 2023 07:21 IST|Sakshi

న్యూఢిల్లీ : మెటావర్స్‌కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వినియోగంలోకి రావడానికి మరో 8–10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 2030 నాటికి రిటైల్, తయారీ, మీడియా, హెల్త్‌కేర్, టెలికం, ప్రొఫెషనల్‌ సర్వీసెస్, బ్యాంకింగ్‌ తదితర రంగాలు దీనిపై గణనీయంగా వెచ్చించనున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అండ్‌ కంపెనీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

ఇందులో మెటావర్స్‌ సాధనాల వినియోగం తీరుతెన్నులను వివరించారు. దీని ప్రకారం 2017లో కృత్రిమ మేథ (ఏఐ) విషయంలో ఎలాంటి ధోరణులు కనిపించాయో ఇప్పుటు మెటావర్స్‌ను కంపెనీలు వినియోగించడంపైనా అలాంటి ధోరణులే కనిపిస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలికంగా మెటావర్స్‌ సొల్యూషన్స్‌ను ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు గతేడాది 57 శాతం మంది చీఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్స్‌ తెలిపినట్లు సర్వేలో తేలింది. ఇటీవలి సాంకేతికత పురోగతి కారణంగా ఇంటర్నెట్‌లో తదుపరి విప్లవంగా మెటావర్స్‌ ముందు వరుసలో ఉండనుందని నివేదిక పేర్కొంది. 

భారీగా పెట్టుబడులు .. 
మెటావర్స్‌ విభాగంలోకి ప్రైవేట్‌ ఈక్విటీ/వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. గతేడాది ప్రథమార్ధంలో 120 బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. వివిధ మాధ్యమాల ద్వారా కస్టమర్‌కు సర్వీసులు అందించడం, రియల్‌ టైమ్‌లో ఉత్పత్తుల డిజైనింగ్‌ను పరీక్షించడం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడగలదని వివరించింది.

3డీ/టెక్నికల్‌ ఆర్టిస్ట్‌లు, మోషన్‌ డిజైనర్లు, గ్రాఫిక్స్‌ ఇంజినీర్లు మొదలైన వారు ఈ టెక్నాలజీ విస్తరణలో కీలకపాత్ర పోషిస్తారని నివేదిక తెలిపింది. అయితే, దీన్ని భారీ స్థాయిలో విస్తరించాలంటే .. పెట్టుబడులపై రాబడులు, టెక్నాలజీ, టాలెంట్‌ సంసిద్ధత వంటి అంశాలపై స్పష్టత అవసరమని నివేదిక పేర్కొంది.   

మరిన్ని వార్తలు