ఈకామర్స్‌ ఫ్లాష్‌సేల్స్‌, కేంద్రానికి నాస్కామ్‌ సిఫార్సులు

24 Jul, 2021 07:43 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ కంపెనీల కార్యకలాపాలకు అనుగుణంగానే వాటి బాధ్యతలను కూడా క్రమబద్ధీకరించాలని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే వినియోగదారులకు సకాలంలో రీఫండ్‌ అందేలా చూసేంత వరకు మాతమ్రే వాటి బాధ్యతలను పరిమితం చేయాలని పేర్కొంది. ఈ–కామర్స్‌ సంస్థల నిబంధనల ముసాయిదాకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలపై నాస్కామ్‌ ఈ మేరకు తన అభిప్రాయాలు తెలియజేసింది. మోసపూరిత ఫ్లాష్‌ సేల్స్, ఉత్పత్తులు.. సర్వీసులను మోసపూరితంగా విక్రయించడం వంటి వాటిని నిషేధించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం జూన్‌ 21 ఈ నిబంధనలను ప్రతిపాదించింది. వీటిపై పరిశ్రమ వర్గాలు, ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడానికి జూలై 6 ఆఖరు తేదీ అయినప్పటికీ ఆగస్టు 5 దాకా పొడిగించింది. వీటిపైనే నాస్కామ్‌ తాజాగా తమ అభిప్రాయాలు తెలియజేసింది.  
ప్రతిపాదిత నిబంధనల్లోని కొన్ని అంశాలు వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి కాకుండా కాంపిటీషన్‌ చట్టం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం పరిధిలోకి వచ్చే విధంగా ఉన్నాయని పేర్కొంది. కొన్ని కార్యకలాపాలను నిషేధించడం కాకుండా వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అవసరమైతే సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) విచారణ జరిపేలా.. అనుచిత వాణిజ్య విధానాలకు సంబంధించి సూచనప్రాయంగా ఒక జాబితాలాంటిది పొందుపర్చవచ్చని నాస్కామ్‌ తెలిపింది.  

మరిన్ని వార్తలు