నాట్కో సీటీపీఆర్‌కు తొలగిన అడ్డంకి, షేర్లు జూమ్‌

20 Sep, 2022 12:18 IST|Sakshi

హైదరాబాద్: క్లోరంట్రానిలిప్రోల్‌ (సీటీపీఆర్‌) పురుగు మందులను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టేందుకు నాట్కో ఫార్మాకు అడ్డంకి తొలగిపోయింది. ఢిల్లీ హైకోర్టు నుంచి ఈ మేరకు కంపెనీ ఉపశమనం పొందింది. సీటీపీఆర్‌ విషయంలో నాట్కో ఫార్మా పేటెంట్‌ ఉల్లంఘనకు పాల్పడిందంటూ యూఎస్‌కు చెందిన ఎఫ్‌ఎంసీ కార్పొరేషన్‌ గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

కాగా, సీటీపీఆర్‌ను దేశీయంగా తయారు చేయడం కోసం సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్‌ బోర్డ్, రిజిస్ట్రేషన్‌ కమిటీ నుండి అనుమతి పొందిన తొలి కంపెనీ తామేనని నాట్కో సోమవారం తెలిపింది. వివిధ పంటల్లో వచ్చే తెగులు నివారణకు ఈ పురుగు మందును వాడతారు. సీటీపీఆర్‌ ఆధారిత ఉత్పత్తుల విపణి భారత్‌లో సుమారు రూ.2,000 కోట్లు ఉంటుందని నాట్కో వెల్లడించింది. త్వరలో ఈ ఉత్పత్తులను ప్రవేశపెడతామని కంపెనీ ప్రకటించింది.  ఈ వార్తలతో  నాట్కో ఫార్మా  షేరుపై ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకింది.  మంగళవారం ఉదయం ఈ  షేరు  రూ. 16.95 లేదా 3 శాతం పెరిగి రూ.654 వద్ద ఉంది.


 

మరిన్ని వార్తలు