స్కాములెన్ని ఉన్నా.. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో పీఎన్‌బీనే మిన్న

22 Mar, 2022 10:24 IST|Sakshi

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌తో రూ.61,000 కోట్లు

బ్యాంకింగ్‌ రికవరీలపై మంత్రి భగవత్‌ కరద్‌ 

పార్లమెంటులో వివరాల వెల్లడి 

వరుస స్కామ్‌లలో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతోంది పంబాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌. స్కాములు వెంటాడుతున్నా మొండి బకాయిలు వసూలు చేసుకోవడంలో మెరుగైన పనితీరునే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కనబరుస్తోంది. గతేడాది వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో పీఎన్‌బీ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది.

పార్లమెంటులో
దేశంలోని 11 బ్యాంకులు గడచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 డిసెంబర్‌ వరకూ, అలాగే అంతకుముందు మూడు ఆర్థిక సంవత్సరాలు) వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ ద్వారా దాదాపు రూ.61,000 కోట్లను రికవరీ చేశాయని ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కరద్‌ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. మంత్రి ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 
- రిజర్వ్‌ బ్యాంక్‌ సూచనల ప్రకారం, తమ బోర్డు ఆమోదించిన లోన్‌ రికవరీ పాలసీని బ్యాంకులు కలిగి ఉండాలి. తద్వారా రాజీ, వన్‌–టైమ్‌ సెటిల్‌మెంట్‌ మార్గాలతో మొండిబకాయిలకు సంబంధించి రుణ రికవరీ జరగాలి. కనిష్ట వ్యయంతో సాధ్యమైనంత గరిష్ట ప్రయోజనం పొందేలా రికవరీ ప్రక్రియ ఉండాలి.  
- బ్యాంకులు తమ నిధులను సత్వరం పొందడం, తిరిగి వాటిని రుణాలకు వినియోగించుకోవడం, తగిన ప్రయోజనం పొందడం (రీసైకిల్‌) వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ప్రధాన ఉద్దేశం.  
- ఆయా పక్రియ ద్వారా 11 జాతీయ బ్యాంకులు గడచిన నాలుగు సంవత్సరాల్లో 38,23,432 కేసులను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌గా పరిష్కరించాయి. తద్వారా రూ.60,940 కోట్లు రికవరీ చేశాయి.  
- వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ విషయంలో 8.87 లక్షల కేసులతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తొలి స్థానంలో నిలిచింది. తరువాత వరుసలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (4.97 లక్షలు) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (4.34 లక్షలు) ఇండియన్‌ బ్యాంక్‌ (4.27 లక్షలు),  కెనరా బ్యాంక్‌ (4.18 లక్షలు) సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (4.02 లక్షలు), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (2.99 లక్షలు),  యూకో బ్యాంక్‌ (2.38 లక్షలు)ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (1.33 లక్షలు) బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (63,202) పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ (20,607) ఉన్నాయి.    
 

మరిన్ని వార్తలు