టెక్నాలజీ దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్‌

8 Jun, 2022 16:32 IST|Sakshi

నియంత్రణ సంస్థలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచన   

నేషనల్‌ సీఎస్‌ఆర్‌ ఎక్స్‌చేంజ్‌పోర్టల్, ఎస్‌ఎన్‌ఏ డ్యాష్‌బోర్డ్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్‌ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్‌ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్‌పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (ఏకేఏఎం) ఐకానిక్‌ డే వేడుకలను ప్రారంభించిన సందర్భంగా నిర్మలా సీతారామన్‌ ఈ విషయాలు తెలిపారు. మార్కెట్లపై డిజిటైజేషన్‌ ప్రభావం గణనీయంగా ఉంటోందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఎక్కడ దుర్వినియోగ మవుతున్నాయి, ఎక్కడ సడలించాలి, ఎక్కడ కఠినతరం చేయాలి అనే అంశాలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ), నేషనల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) తదితర నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్‌ సూచించారు. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్‌ ఇందర్‌జిత్‌ సింగ్, కార్యదర్శి రాజేశ్‌ వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
పారదర్శక విధానాలు ఉండాలి.. 
సమాజాన్ని అన్ని కోణాల్లోనూ ప్రభావితం చేసే డిజిటైజేషన్‌కు సంబంధించిన విధానాలు సముచితంగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఉండాలని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. డిజిటైజేషన్‌తో నియంత్రణ సంస్థలు, ఇతరత్రా సంస్థలు ప్రయోజనం పొందాలన్నారు. అదే సమయంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్‌ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచేందుకు నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. 
మార్కెట్లకు రిటైల్‌ ఇన్వెస్టర్ల దన్ను.. 
తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే స్టాక్‌ మార్కెట్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లు షాక్‌ అబ్జర్బర్లుగా ఉంటున్నారని నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగినా మార్కెట్లు పతనం కాకుండా దన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంక్య గణనీయంగా పెరిగిందని ఆమె తెలిపారు. మార్చి నెల గణాంకాల ప్రకారం సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (ఇండియా) దగ్గర యాక్టివ్‌గా ఉన్న డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య ఆరు కోట్లకు పెరిగింది.
ఎస్‌ఎన్‌ఏతో పారదర్శక పాలన.. 
కార్యక్రమంలో భాగంగా నేషనల్‌ సీఎస్‌ఆర్‌ ఎక్సే్చంజ్‌ పోర్టల్‌ను, ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించడంపై స్మారక పోస్టల్‌ స్టాంపును ఆవిష్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదలాయింపు, వాటి వినియోగాన్ని ట్రాక్‌ చేసేందుకు ఉపయోగపడే సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ) డ్యాష్‌బోర్డును సీతారామన్‌ ఆవిష్కరించారు. దీనితో పాలన మరింత పారదర్శకంగా మారగలదని, రాష్ట్రాలకు కేంద్రం పంపే ప్రతీ రూపాయికి లెక్క ఉంటుందన్నారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రాలకు రూ. 4.46 లక్షల కోట్లు బదిలీ అవుతుంటాయని మంత్రి చెప్పారు. 75 ఏళ్లు పైబడిన వారికి క్లెయిమ్‌ల విషయంలో తోడ్పాటు కోసం ఐఈపీఎఫ్‌ఏ ప్రత్యేక విండో ప్రారంభించింది.

మరిన్ని వార్తలు