దశాబ్ద కనిష్టానికి గ్యాస్‌ రేటు!

17 Aug, 2020 04:30 IST|Sakshi

సహజ వాయువు ధర 1.9 డాలర్లకు తగ్గే అవకాశాలు

అక్టోబర్‌ 1న ధర సమీక్ష

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా సహజ వాయువు (నేచురల్‌ గ్యాస్‌) ధర దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉన్నట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. గ్యాస్‌ ఎగుమతి దేశాల ప్రామాణిక రేట్లను బట్టి చూస్తే మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌ (ఎంబీటీయూ) ధర 1.9–1.94 డాలర్ల స్థాయికి తగ్గొచ్చని, ఇది దశాబ్దంపైగా కనిష్ట స్థాయి. అక్టోబర్‌1న జరిగే గ్యాస్‌ ధర సమీక్షలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వివరించాయి. ఎరువులు, విద్యుదుత్పత్తితో పాటు వాహనాల్లో సీఎన్‌జీగా, వంట గ్యాస్‌ అవసరాల కోసం ఉపయోగపడే గ్యాస్‌ రేటును ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్‌ 1న, అక్టోబర్‌ 1న) ప్రభుత్వం సమీక్షిస్తుంది.

ఓఎన్‌జీసీకి కష్టకాలం..
అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్‌ మిగులు దేశాల రేట్లను ప్రామాణికంగా తీసుకుని 2014 నవంబర్‌లో ప్రభుత్వం కొత్తగా గ్యాస్‌ ఫార్ములాను ప్రవేశపెట్టినప్పట్నుంచీ దేశీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌పై ఓఎన్‌జీసీ నష్టాలు చవిచూస్తోంది. బ్రేక్‌ ఈవెన్‌ రేటు (లాభ నష్టాలు లేని ధర) 5–9 డాలర్లుగా ఉంటోందని, ప్రస్తుతం నిర్ణయించిన 2.39 డాలర్ల ధర గిట్టుబాటు కాదంటూ కేంద్రానికి ఓఎన్‌జీసీ ఇటీవలే తెలిపినట్లు సమాచారం. గతంలో గ్యాస్‌ విభాగంలో నష్టాలను చమురు విభాగం ద్వారా ఓఎన్‌జీసీ కాస్త భర్తీ చేసుకోగలిగేది. కానీ ప్రస్తుతం చమురు వ్యాపారం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉండడం కంపెనీకి ప్రతికూలాంశం.

మరిన్ని వార్తలు