ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీలకు సానుకూలం     

23 Jul, 2022 13:21 IST|Sakshi

ఆస్తుల్లో 9-11 శాతం వృద్ధికి అవకాశం 

 2022–23పై ఇక్రా నివేదిక

ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు), గృహ రుణ సంస్థలు (హెచ్‌ఎఫ్‌సీలు) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం మేర వృద్ధిని చూస్తాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల ఏయూఎం వృద్ధి ప్రధానంగా చివరి త్రైమాసికం (2022 జనవరి-మార్చి)లో నమోదైనట్టుగా పేర్కొంది. హెచ్‌ఎఫ్‌సీల ఆస్తులు 10 శాతం పెరగ్గా, ఎన్‌బీఎఫ్‌సీల రిటైల్‌ ఆస్తులు 8.5 శాతం, హోల్‌సేల్‌ ఆస్తులు 12 శాతం చొప్పున వృద్ధి చెందాయని  బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు (ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌ కంపెనీలు కాకుండా) మొత్తం మీద 9–11 శాతం మేర వృద్ధిని నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్టు ఇక్రా వివరించింది. ఈ సంస్థలు ఇచ్చిన రుణాలనే ఆస్తులుగా పరిగణిస్తారు. 

నిధుల మార్గాలు 
ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు తమ నిధుల అవసరాల కోసం నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ (ఎన్‌సీడీలు) ఇష్యూలను చేపట్టడం అన్నది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో  ఎన్నో త్రైమాసికాల కనిష్టానికి చేరినట్టు ఇక్రా నివేదిక తెలియ జేసింది.  2021-22 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 28 శాతం తగ్గాయని, 2020-21 మొదటి త్రైమాసికంలోని ఇష్యూలతో పోల్చినా 65 శాతం తక్కువగా ఉన్నట్టు వివరించింది. ఆర్‌బీఐ ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో రెపో రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం పెరిగిన పరిస్థితుల్లో వీటి ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతగా లేదని తెలిపింది. కమర్షియల్‌ పేపర్ల రూపంలో నిధుల సమీకరణ గత కొన్ని నెలల్లో కొంత పుంజుకున్నట్టు పేర్కొంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమం, పోటీ ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు మార్జిన్లను కాపాడుకు నేందుకు స్వల్పకాల నిధుల వాటాను పెంచుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది.    

>
మరిన్ని వార్తలు