Neal Mohan: యూట్యూబ్‌ కొత్త సీఈఓకు జీతమెంతో తెలుసా?

18 Feb, 2023 17:28 IST|Sakshi

భారత సంతతికి చెందిన నీల్ మోహన్ ఇప్పుడు యూట్యూబ్ కొత్త సీఈవోగా బాధ్యతలను స్వీకరించనున్నారు.  అయితే సుసాన్ వోజ్‌కికీ స్థానంలో నియమితులైన నీల్మోహన్ భారీ ప్యాకేజీ అందుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ-అమెరికన్ మోహన్.. సుసాన్ వోజ్‌కికీ నేతృత్వంలోని అత్యంత సీనియర్ అధికారులలో ఒకరిగా యూట్యూబ్‌ చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. సీఈఓగా అర్హుల జాబితాలో చాలామంది ఉన్నా నీల్‌ మోహన్‌నే యూట్యూబ్‌ ఎంపిక చేయడం విశేషం. 

యూట్యూబ్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తుండటంతో పాటు అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో కూడా మోహన్‌ పని చేశారు. గూగుల్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన కెరీర్ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌లో చిన్న ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. గూగుల్‌లో డిస్‌ప్లే, వీడియో ప్రకటనల విభాగాన్ని పర్యవేక్షించిన ఆయన యూట్యూబ్‌, గూగుల్‌ డిస్‌ప్లే నెట్‌వర్క్, యాడ్‌సెన్స్‌, యాడ్‌మాబ్‌, డబుల్‌ క్లిక్‌ యాడ్ టెక్ వంటి ఉత్పత్తి సేవల బాధ్యతలు నిర్వహించారు.

యూట్యూబ్‌కు  రాజీనామా చేసిన వోజ్‌కికీకి యాజమాన్యం భారీ జీతం ఇచ్చేది. మీడియా నివేదికల ప్రకారం నెలకు సుమారు 3,74,829 యూఎస్‌ డాలర్ల జీతం తీసుకునేవారు ఆమె.  అంటే మన కరెన్సీలో రూ. 3.1 కోట్లు. దీని బట్టే..కొత్త సీఈవో నీల్ మోహన్ జీతం అంతకు మించి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. గతంలో నీల్ మోహన్ ట్విటర్‌కు మారకుండా ఉండేందుకు గూగుల్ నుంచి 100 మిలియన్ డాలర్లు బోనస్‌గా అందుకున్నట్లు తెలిసింది.

(ఇదీ చదవండి: యూట్యూబ్‌ సీఈవోగా భారతీయుడు.. అసలు ఎవరీ నీల్‌ మోహన్‌!)

మరిన్ని వార్తలు