బయోటెక్‌ రంగానికి సత్వర అనుమతులు కావాలి

26 Sep, 2022 06:37 IST|Sakshi

సీఐఐ నివేదిక సూచన

న్యూఢిల్లీ: బయోఫార్మాలో భారత్‌ మరింత బలమైన పాత్ర పోషించేందుకు పరిశ్రమల మండలి సీఐఐ కీలక సూచనలు చేసింది. బయోటెక్‌ రంగానికి వేగవంతమైన నియంత్రణ ప్రక్రియ, అనుమతులు అవసరమని పేర్కొంది. ఉత్పత్తిని ప్రవేశపెట్టడంలో జాప్యం చోటుచేసుకుంటే అది భారీ నష్టానికి దారితీస్తుందని ప్రస్తావించింది. బయోటెక్‌ రంగాన్ని మూడు మంత్రిత్వ శాఖల పరిధిలోని విభాగాలు, ఉప కమిటీలు నియంత్రిస్తున్నాయంటూ.. వాటి మధ్య సమన్వయం బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. ఇది జాప్యానికి దారితీస్తోందని, దీన్ని పరిహరించాల్సిన అవసరాన్ని సూచించింది. ‘రోడ్‌మ్యాప్‌ ఫర్‌ ఇండియన్‌ లైఫ్‌ సైన్సెస్‌  ః2047’ పేరుతో సీఐఐ ఓ నివేదికను విడుదల చేసింది.

‘‘ప్రస్తుతానికి బయోసిమిలర్‌ బ్యాచ్‌ను సమీక్షించేందుకు 20–25 రోజులు, తయారీ సైకిల్‌కు 45–90 రోజుల సమయం తీసుకుంటోంది. ఈ అంతరాలను తొలగించేందుకు పరిశ్రమకు చెందిన నిపుణులతో సలహా మండళ్లను ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ తరహా వ్యవహారాల్లో నిపుణులతో కూడిన సలహా మండళ్ల నుంచి సలహాలు పొందొచ్చు’’అని సీఐఐ నివేదిక పేర్కొంది. విధానాల రూపకల్పన, అమలులో స్వయంప్రతిపత్తి అవసరమని తెలిపింది. సమయం, పరిశోధన, అభివృద్ధి ప్రభావం బయోసిమిలర్‌ ఔషధ ఉత్పత్తి ధరపై గణనీయంగా ఉంటుందని పేర్కొంది. చైనాను ఉదహరిస్తూ.. ఏకైక అనుమతుల విండో అయిన ‘చైనా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అలాగే, యూఎస్‌ఎఫ్‌డీఏ కూడా విధానాల రూపకల్పన, అమలును ఒకే గొడుగు కింద చూస్తున్నట్టు గుర్తు చేసింది. 2030 నాటికి అంతర్జాతీయంగా ఫార్మా రంగంలో బయోఫార్మా వాటా 40 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు