ఈవీల విస్తరణలో టెక్నాలజీ కీలకం

30 Jun, 2022 06:35 IST|Sakshi

ప్రోత్సాహకాలు, విధానాల పాత్ర

ఎలక్ట్రిక్‌ వాహనాలపై నీతి ఆయోగ్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల వినియోగం మరింత పెంచేందుకు టెక్నాలజీ పురోగతి, ప్రోత్సాహకాలు అవసరమని నీతి ఆయోగ్‌ సూచించింది. ‘భారత్‌లో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల విస్తరణ అంచనా’ పేరుతో నీతి ఆయోగ్‌ ఒక నివేది క రూపొందించింది. భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో ఎలక్ట్రిక్‌ రవాణా లేదా మరో పర్యావరణ అనుకూల రవాణాకు అయినా నియంత్రణ వ్యవస్థ అవసరమని అభిప్రాయపడింది.

మెరుగైన టెక్నాలజీలు, ప్రభుత్వం వైపు నుంచి మరిన్ని చర్యల మద్దతుతో దేశంలో ఈవీల వినియోగాన్ని భారీగా పెంచే అవకాశాలున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. వినియోగదారుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల పట్ల సానుకూల దృక్పథం ఉందంటూ, ఇటీవల పెట్రోల్‌ ధరలు భారీగా పెరగడం కూడా వినియోగదారులు ఈవీల వైపు అడుగులు వేయడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపింది. ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పట్ల ప్రజల్లో అవగామన విస్తృతమైనట్టు వివరించింది.  

తయారీ వ్యయం
ఈవీల తయారీ వ్యయం ప్రధాన అంశంగా నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. వాహనం ధరలో బ్యాటరీ ఖర్చే ఎక్కువగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాల దిగుమతులను తగ్గించుకోవడం, ఇతర విధానపరమైన చర్యలు.. దేశీయంగా తయారీని పెంచేందుకు అవసరమని సూచించింది. తొలి దశలో ఎలక్ట్రిక్‌ వాహనాలతో పోలిస్తే అధిక చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు ద్వారా వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. ఆ తర్వాత ఈ రేషియో దిగొస్తుందని పేర్కొంది. విధానాలు, సదుపాయాలకు తోడు, టెక్నాలజీ కూడా ఈవీల వ్యాప్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. మూడేళ్ల కాలంలో ఈవీ ఎలాంటి పనితీరు చూపిస్తుంది? బ్యాటరీ సామర్థ్యం వాహనాల విస్తరణపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది.   

మరిన్ని వార్తలు