నెస్లే ఇండియా భారీ పెట్టుబడులు

24 Sep, 2022 00:59 IST|Sakshi

2025కల్లా రూ. 5,000 కోట్లు

కొత్త ప్లాంట్లు, కొనుగోళ్లపై దృష్టి

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్‌ఏ దేశీయంగా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. రానున్న మూడున్నరేళ్లలోగా అంటే 2025కల్లా రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మార్క్‌ ష్నీడర్‌ వెల్లడించారు. తద్వారా దేశీ బిజినెస్‌కు జోష్‌నివ్వడంతోపాటు కొత్త వృద్ధి అవకాశాలను అందుకోనున్నట్లు తెలియజేశారు. నిధులను పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.

కొత్త ప్లాంట్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లను నిర్వహిస్తోంది. కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు తగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్‌ నారాయణన్‌ పేర్కొన్నారు. పెట్టుబడులకు అధికారిక సంస్థల నుంచి అనుమతులు లభించాల్సి ఉండగా.. మరింత మందికి ఉపాధి లభించే వీలుంది. ప్రస్తుతం 6,000 మంది సిబ్బంది ఉన్నారు.

టాప్‌–10లో ఒకటి...
నెస్లేకు ప్రాధాన్యతగల టాప్‌–10 మార్కెట్లలో ఒకటైన ఇండియాలో 2025కల్లా రూ. 5,000 కోట్లు వెచ్చించనున్నట్లు ష్నీడర్‌ తెలియజేశారు. కంపెనీ గత ఆరు దశాబ్దాలలో రూ. 8,000 కోట్లను వెచ్చించినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా 110 ఏళ్ల క్రితమే కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ 1960 నుంచీ తయారీకి తెరతీసినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు