ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సూపర్‌

30 Nov, 2021 06:28 IST|Sakshi

నవంబర్‌ 23కు 68 శాతం అప్‌

రూ.6.92 లక్షల కోట్లుగా నమోదు

కోవిడ్‌ ముందస్తుతో పోల్చినా అధికం

న్యూఢిల్లీ: దేశంలో ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ పరిమాణం ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (2021 ఏప్రిల్‌) నవంబర్‌ 23 నాటికి 2020–21 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 68 శాతం పెరిగి రూ.6.92 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ సహాయమంతి పంకజ్‌ చతుర్వేది లోక్‌సభ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారాన్ని పరిశీలిస్తే..

► 2021–22 నవంబర్‌ 23 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6,92,834 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ మొత్తం 68 శాతం అధికమైతే, కోవిడ్‌ ముందస్తు కాలం 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మాత్రం 27.29 శాతం అధికం. 2020–21 ఏప్రిల్‌  1 నుంచి నవంబర్‌ 23 మధ్య నికర వసూళ్లు రూ.4.12 లక్షల కోట్లయితే, 2019–20 మధ్య ఈ మొత్తం రూ.5.44 లక్షల కోట్లు.  

► 2021 నవంబర్‌ 23వ తేదీ వరకూ చూస్తే, రిఫండ్స్‌ జరక్క ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.15 లక్షల కోట్లు. 2021 ఇదే కాలంలో పోల్చితే  స్థూల వసూళ్ల వృద్ధి 48.11 శాతం.  

► ఇక పరోక్ష పన్నుల విషయానికి వస్తే  వస్తు సేవల  పన్నులో (జీఎస్‌టీ) గణనీయమై వృద్ధి ధోరణి కనబడుతోంది. 2020–21 జీఎస్‌టీ వసూళ్లు రూ.11.36 లక్షల కోట్లు. 2021–22 అక్టోబర్‌ వరకూ ఈ వసూళ్లు రూ.8.10 లక్షల కోట్లు.  

► పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయి. జీఎస్‌టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణం.  

► 2021–22 బడ్జెట్లో పన్నుల ఆదాయం రూ.22.2 లక్షల కోట్లుగా కేంద్రం అంచనాలు వేసింది. ఇందులో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్‌ ట్యాక్స్‌ రూపంలో రూ.5.47 లక్షల కోట్లుగా రావచ్చని అంచనా. 2020–21లో పన్నుల ఆదాయం రూ.20.2 లక్షల కోట్లు.

మరిన్ని వార్తలు