ఐసీఐసీఐ లాభం హైజంప్‌

25 Jul, 2021 23:40 IST|Sakshi

క్యూ1లో రూ. 4,747 కోట్లు

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రస్తుత ఏడాది(2021–22) తొలి క్వార్టర్‌లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 4,747 కోట్లను తాకింది. స్టాండెలోన్‌ నికర లాభం మరింత అధికంగా 77 శాతం దూసుకెళ్లి రూ. 4,616 కోట్లను అధిగమించింది. మొత్తం ప్రొవిజన్లు 62 శాతం తగ్గి రూ. 2,852 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) పెరగనున్న అంచనాలతో గతేడాది క్యూ1లో రూ. 7,594 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. తాజా స్లిప్పేజెస్‌ రూ. 7,231 కోట్లకు చేరాయి. వీటిలో రిటైల్, బిజినెస్‌ బ్యాంకింగ్‌ వాటా రూ. 6,773 కోట్లు. ఎస్‌ఎంఈ, కార్పొరేట్‌ విభాగం నుంచి రూ. 458 కోట్లు నమోదైంది.

ఎన్‌పీఏలు ఇలా
ఐసీఐసీఐ బ్యాంక్‌ జీఎన్‌పీఏలు గతేడాది క్యూ1తో పోలిస్తే 5.46 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఇవి 4.96 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 1.14 శాతం నుంచి 1.16 శాతానికి స్వల్పంగా పెరిగాయి. రిటైల్, బ్యాంకింగ్‌ బిజినెస్‌ విభాగంలో మరింత ఎక్కువగా 2.04 శాతం నుంచి 3.75 శాతానికి పెరిగాయి. కాగా.. నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 10,936 కోట్లను తాకింది. ఇతర ఆదాయం 56 శాతం ఎగసి రూ. 3,706 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 0.2 శాతం బలపడి 3.89 శాతానికి చేరాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 19.27 శాతంగా నమోదైంది.

మరిన్ని వార్తలు