Gautam Adani Net Worth: అంబానీ.. అదానీ.. నువ్వా నేనా..!

13 Nov, 2021 19:56 IST|Sakshi

మన దేశ ధనవంతుల జాబితాలో అగ్రస్థానం కోసం గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీ పోటీ పడుతున్నారు. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు & చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 2021లో 52 బిలియన్ డాలర్లు(153.8 శాతం)  పెరిగింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. అతని ప్రస్తుత నికర విలువ 85.8 బిలియన్ డాలర్లు. దీంతో గౌతమ్ అదానీ భారత దేశంలో రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. దేశంలో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) చైర్మన్ ముఖేష్ అంబానీ నికర ఆస్తి విలువ(97.2 బిలియన్ డాలర్లు) కంటే 11.4 బిలియన్ డాలర్లు తక్కువగా గౌతమ్ అదానీ ఆస్తి ఉంది. 

ప్రస్తుతం అదానీ భారతదేశంలో రెండో ధనవంతుడు మాత్రమే కాకుండా ఆసియాలో రెండో ధనవంతుడిగా కూడా నిలిచారు. ఏప్రిల్ 2020 నుంచి అదానీ నికర ఆస్తి విలువ గణనీయంగా పెరిగింది. 18 మార్చి 2020న, అతని నికర విలువ 4.91 బిలియన్ డాలర్లు ఉంటే 20 నెలల్లోనే అతని నికర విలువ 1747 శాతానికి పైగా(80.89 బిలియన్ డాలర్లు) పెరిగింది. ఇదే కాలంలో ముఖేష్ అంబానీ నికర విలువ 254 శాతం(59 బిలియన్ డాలర్లు) పెరిగింది. గౌతమ్ అదానీ భారతదేశంలో అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అయిన అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఫోర్బ్స్ ప్రకారం, అతను ఆస్ట్రేలియాలో వివాదాస్పద బొగ్గు గనుల ప్రాజెక్టు అయిన అబోట్ పాయింట్ కొనుగోలు చేశాడు. 

భారతదేశంలో అత్యంత రద్దీ గల ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 74 శాతం వాటాను కలిగి ఉన్నాడు. ఇటీవల, ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ డెవలపర్ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఎజీఈఎల్), భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ పవర్ ట్రాన్స్ మిషన్ & రిటైల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్(ఎటీఎల్) కాప్‌-26 సదస్సులో తమ ఎనర్జీ కాంపాక్ట్‌ లక్ష్యాలను ప్రకటించాయి.

(చదవండి: 18 ఏళ్లలోపు వారికి కూడా పాన్ కార్డు.. పొందండి ఇలా?)

మరిన్ని వార్తలు