230 మిలియన్లకు చేరిన యూజర్లు, నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో పదవికి రీడ్‌ హేస్టింగ్స్‌ గుడ్‌బై

20 Jan, 2023 13:19 IST|Sakshi

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ గత ఏడాది ముగిసే సమయానికి నిపుణుల అంచనాలకు మించి ప్రపంచ వ్యాప్తంగా 230 మిలియన్‌ సబ్‌స్కైబర్లు చేరినట్లు ప్రకటించింది. 

పాస్‌వర్డ్‌ షేరింగ్‌, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా సేవల్ని నిలిపి వేయడం, ఆర్ధిక అనిశ్చితితో ఆ సంస్థ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. అయితే ‘వెడ్నస్‌డే’, ‘హ్యారీ అండ్‌ మేఘన్‌’ షోల కారణంగా చేజారిపోయిన సబ్‌స్కైబర్లు తిరిగి చేరినట్లు తెలిపింది.

ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ డీవీడీ సర్వీసుల్ని రెంట్‌ ఇచ్చే స్థాయి నుంచి ఎంటర్‌టైన్మెంట్‌ దిగ్గజంగా అవతరించేందుకు సుదీర్ఘకాలం పాటు విశేష్‌ సేవలందించిన రీడ్‌ హేస్టింగ్స్‌  నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని రీడ్‌ హేస్టింగ్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఇక, ఆయన బాధ్యతల్ని సీఎఫ్‌ఓ గ్రెగ్‌ పీటర్స్‌, టెడ్‌ శారండోస్‌కు అప్పగించారు. తాను ఇకపై ఇతర టెక్‌ దిగ్గజ వ్యవస్థాపకుల తరహాలోనే కార్యనిర్వాహక ఛైర్మన్‌గా కొనసాగుతానని హేస్టింగ్స్‌ చెప్పారు.   

మూడు నెలల్లో 7.3 మిలియన్ల సబ్‌స్కైబర్లు
అంతేకాదు మూడు నెలల్లో 7.3 మిలియన్ల మంది చందాదారులు చేరగా..ఆ మొత్తం సంఖ్య 230 మిలియన్ల మందికి చేరింది. ఇక హర్రర్‌ కామెడీ జానర్‌లో వచ్చిన వెడ్నస్‌డే,ఆడమ్స్‌ ఫ్యామిలీలు అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లో చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు