ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్.. మిగతా ఓటీటీలకు షాక్

21 Nov, 2020 10:12 IST|Sakshi

ఓటీటీ వీక్షకులకు శుభవార్త తెలిపింది నెట్‌ఫ్లిక్స్. ఓటీటీ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్ట్రీమింగ్‌ ఫెస్ట్‌ను డిసెంబర్ 5న అధికారికంగా ప్రారంభిస్తామని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. ఈ 48 గంటల ఫెస్ట్‌ను డిసెంబర్ 5న తెల్లవారుజామున 12.01 నుండి డిసెంబర్ 6న రాత్రి 11.59 గంటలకు వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది నెట్‌ఫ్లిక్స్. డిసెంబర్‌ 5, 6 తేదీల్లో అభిమానులు ఉచితంగా సినిమాలు, వెబ్‌ సిరీసులు, భారతీయ భాషల్లో కంటెంట్‌ను చూడొచ్చని తెలిపింది. చందాదారులు కానివారు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షణ అనుభూతిని పొందేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నామని వెల్లడించింది. (చదవండి: డౌన్‌లోడ్ లో అగ్రస్థానంలో భారత్)

భారత ఓటీటీ మార్కెట్లో అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, జీ5 వంటి వాటికీ పోటీగా ఎదిగేందుకే నెట్‌ఫ్లిక్స్‌ రెండు రోజులు ఉచితంగా కంటెంట్‌ను వీక్షించే అవకాశాల్ని కల్పిస్తుండటం గమనార్హం. ‘భారతీయ ప్రేక్షకులను రంజింపజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కథలను నెట్‌ఫ్లిక్స్‌లో అందిస్తున్నాం. అందుకే డిసెంబర్‌ 5 రాత్రి 12.01 గంటల నుంచి డిసెంబర్‌ 6 రాత్రి 11.59 గంటల వరకు మేం స్ట్రీమింగ్‌ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నాం’ అని ఆ సంస్థ భారత ఉపాధ్యక్షురాలు మోనికా షెర్గిల్‌ తెలిపారు. 

ఈ స్ట్రీమింగ్‌ ఫెస్ట్‌లో కంటెంట్‌ను వీక్షించడానికి మీరు మీ ఇమెయిల్ ఐడీ లేదా పేరు లేదా ఫోన్ నంబర్‌తో సైన్ అప్ చేసుకోవాలి. అలాగే, ఈ రాబోయే ఫెస్ట్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా చెల్లింపు అవసరం లేదని కంపెనీ ధ్రువీకరించింది. ఒకరి లాగిన్‌ సమాచారాన్ని మరొకరు ఉపయోగించుకొనేందుకు వీల్లేదని తెలిపారు. లాగిన్‌ అయిన ఎవరైనా స్టాండర్డ్‌ డెఫినెషన్‌లో వీడియోలను వీక్షించొచ్చని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు