షార్ట్‌ఫిల్మ్‌ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్‌ అదిరిపోయే గుడ్‌న్యూస్‌..!

24 Jan, 2022 19:39 IST|Sakshi

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ షార్ట్‌ఫిల్మ్‌ మేకర్లకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. దేశంలోని యువతలో దాగున్న ప్రతిభను వెలికితీయడం కోసం నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా 'టేక్ టెన్' అనే షార్ట్‌ఫిల్మ్‌ వర్క్ షాప్ & పోటీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ 'టేక్ టెన్' పోటీలో ఎంపికైన వారికి వర్క్ షాప్‌కు హాజరు అయ్యే అవకాశం కల్పించడమే కాకుండా, ఆ తర్వాత 10,000 డాలర్ల(సుమారు రూ.7.5 లక్షలు)కు సమానమైన గ్రాంట్తో షార్ట్‌ఫిల్మ్‌ తీసే అవకాశాన్ని 10 మందికి కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వీరు తీసిన ఈ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో ప్రదర్శించనున్నారు. 

'టేక్ టెన్' కోసం దరఖాస్తు చేసుకోవడానికి పోటీదారులు భారతదేశ పౌరుడు కావడంతో పాటు18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఈ పోటీ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 7, 2022 నుంచి ప్రారంభం కానుంది. పోటీదారులు "మై ఇండియా" అనే అంశంపై రెండు నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, షార్ట్‌ఫిల్మ్‌ని వారి ఫోన్ సహాయంతో షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో ఎంపికైన వారికి రైటింగ్‌, డైరెక్షన్‌, ప్రొడక్షన్‌ వంటి విభాగాల గురించి నేర్చుకునే అవకాశాన్ని పొందొచ్చని నెట్‌ఫ్లెక్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాని యువత కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నెట్‌ప్లెక్స్‌ పేర్కొంది. 'టేక్ టెన్' అనే షార్ట్‌ఫిల్మ్‌ పోటీకి నెట్‌ఫ్లిక్స్‌ ఫండ్ ఫర్ క్రియేటివ్ ఈక్విటీ స్పాన్సర్ చేస్తుంది. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న కమ్యూనిటీలకు చెందిన తర్వాతి తరం కథకులకు మద్దతు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలకు పైగా సంవత్సరానికి 100 మిలియన్ డాలర్లను నిధులను కేటాయించింది.

(చదవండి: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. లక్ష రూపాయలు మటుమాయం!)

మరిన్ని వార్తలు