మరో 300మందికి ఉద్వాసన పలికిన నెట్‌ఫ్లిక్స్

24 Jun, 2022 10:59 IST|Sakshi

సాక్షి, ముంబై: మార్కెట్లో ప్రత్యర్థుల పోటీ, విపరీతంగా సబ్​స్క్రైబర్లను కోల్పోతున్న స్ట్రీమింగ్​ దిగ్గజం నెట్​ఫ్లిక్స్​ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా  రెండో విడత ఉద్యోగాల్లో కోత విధించింది నెట్​ఫ్లిక్స్. ఉద్యోగుల్లో 4శాతం లేదా దాదాపు 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.  గత నెలలో చేసిన కట్ కంటే రెండు రెట్లు  ఎక్కువ.

వ్యాపారంలో గణనీయంగా పెట్టుబడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని సర్దుబాట్లు, ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయమని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌ వృద్ధికి వారు చేసిన కృషికి  కృతజ్ఞులం, ఈ కష్టకాలలో వారికి మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మార్కెటింగ్ బడ్జెట్‌ను తగ్గించడంలో భాగంగా మేలో కొంత మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. దీంతోపాటు, ఏప్రిల్‌లో కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర కీలక సిబ్బందిని కూడా తొలగించింది.

కాగా 2022 తొలి త్రైమాసికంలో 2 లక్షల సబ్‌స్క్రైబర్‌లు నెట్‌ఫ్లిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. తదుపరి త్రైమాసికంలోనూ ఇదే కొనసాగు తుందని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే సబ్‌స్క్రిప్షన్ ఆధారిత రాబడి మోడల్‌ను పెంచి, సంస్థ కార్యకలాపాలను రీటూల్ చేస్తోంది.  జనవరిలో  ధరల పెంపు కారణంగా నెట్‌ఫ్లిక్స్ కష్టాలు కొద్దిగా తగ్గాయి. అయితే అమెజాన్‌,  వాల్‌డిస్నీ, హులూ స్ట్రీమింగ్ కంటెంట్‌తో అధిక పోటీసంస్థ ఆదాయాన్ని దెబ్బ తీస్తోంది. మరోవైపు వరుస తొలగింపులు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు ఉద్యోగులను  ఆందోళనలోకి నెడుతున్నాయి. 

మరిన్ని వార్తలు