కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్‌..

12 Oct, 2020 15:21 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్‌ కోసం రూపొందించిన ప్రకటనే ఇందుకు కారణం. ఇందులో, హిందూ మహిళను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించిన ముస్లిం కుటుంబం, ఆమె సీమంతం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుక చేస్తుంది. ఇక నలభై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోకు, ‘‘తమ సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’’అని తనిష్క్‌ సంస్థ డిస్క్రిప్షన్‌ పొందుపరిచింది. (చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు)

ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఈ యాడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వీడియో, లవ్‌ జిహాదీని ప్రోత్సహించేలా ఉందని, ఇక నుంచి తనిష్క్‌ ఆభరణాలను కొనే ప్రసక్తే లేదంటూ #BoycottTanishq హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ‘‘కాస్తైనా సిగ్గు ఉండాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి యాడ్‌లు రూపొందించడం ఇకనైనా ఆపేయండి’’ అంటూ ఓ నెటిజన్‌ మండిపడగా.. ‘‘అయినా ప్రతీ యాడ్‌లోనూ హిందూ కోడలే ఎందుకు కనిపిస్తోంది. ముస్లిం కోడలిని చూపించవచ్చు కదా. నిజాన్ని చూపించే దమ్ము ఉందా. ఊరికే అడుగుతున్నా’’ అంటూ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఇంకొంత మంది మాత్రం సృజనాత్మకతకు ఎల్లలు ఉండవని, అయినా ఈ ప్రకటనను అంతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు. మతసామరస్యాన్ని పెంచే ఇలాంటి యాడ్‌లను ప్రశంసించకపోగా ట్రోల్‌ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.   

మరిన్ని వార్తలు