అయ్యో.. ఎలన్‌ మస్క్‌! సంచలన పతనం.. మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని నష్టం!

31 Dec, 2022 18:19 IST|Sakshi

ఎలన్‌ మస్క్‌.. వ్యాపార రంగంలోనే కాదు సోషల్‌ మీడియాలోనూ ఓ ట్రెండ్‌ సెట్టర్‌. గత రెండేళ్లుగా ప్రపంచ మీడియా సంస్థల్లో ఆయన పేరు నానని రోజంటూ లేదు. అంతలా సంచలనాలకు తెర లేపాడు ఆయన. పైపెచ్చు 2021 జనవరిలో వ్యక్తిగత సంపదను 200 బిలియన్ల మార్క్‌​ దాటించుకుని.. మానవ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను దాటేసి.. అపర కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే.. 

ట్విటర్‌ కొనుగోలు నేపథ్యంలో ఎలన్‌ మస్క్‌కు బ్యాడ్‌ టైం నడుస్తున్నట్లు ఉంది. 2022 ఎలన్‌ మస్క్‌కు ఏరకంగానూ కలిసి రాలేదు. ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ పరిణామాలేవీ ఆయన ఖాతాలో పడకపోవడం గమనార్హం. పైగా ఫోర్బ్స్‌ లిస్ట్‌ ప్రకారం.. ప్రపంచ అపర కుబేరుల జాబితా నుంచి రెండో స్థానానికి పడిపోయారు ఆయన. ఏడాది చివరకల్లా..  150 బిలియన్‌ డాలర్లకు దిగువకు పడిపోయింది ఆయన సంపద. ఒకానొక టైంకి 137 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది కూడా.

చరిత్రలో తొలి ట్రిలియన్‌ బిలియనీర్‌గా నిలిచిన ఘనత ఎలన్‌ మస్క్‌దే. నవంబర్‌ 4, 2021 నాటికి ఆయన సంపద అక్షరాల 340 బిలియన్‌ డాలర్లు. కానీ, ఆ మార్క్‌ను ఆయన ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు!. ఎలన్‌ మస్క్‌ సంపద తరుగుతూ వస్తోంది. మరోవైపు ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసినా.. ఆయన సంపదపై ఆ ప్రభావం పడదని ఆర్థిక విశ్లేషకులు  భావించారు. కానీ, అ అంచనా తప్పింది. 

టెస్లా షేర్లు గణనీయంగా, క్రమం తప్పకుండా పతనం అవుతుండడం(2022లో ఏకంగా 65 శాతం దాకా పతనం అయ్యింది) ఆయన సంపద కరిగిపోవడానికి ప్రధాన కారణంగా మారింది. అయితే ఎలన్‌ మస్క్‌ మాత్రం టెస్లా అద్భుతంగా పని చేస్తోందని, అది అంతకు ముందు కంటే అద్భుతంగా ఉందంటూ డిసెంబర్‌ 16వ తేదీన ఒక ట్వీట్‌ చేశాడు. గణాంకాలు మాత్రం విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లే ఉన్నాయి. మిగతా సొంత కంపెనీలతో(న్యూరాలింక్‌, ఓపెన్‌ ఏఐ, స్పేస్‌ఎక్స్‌.. దీని అనుబంధ సంస్థ స్టార్‌లింక్‌, ది బోరింగ్‌ కంపెనీలతో  ఎలన్‌ మస్క్‌కు పెద్దగా ఒరిగింది కూడా ఏం లేకపోవడం గమనార్హం!. 

ఈ కథనం రాసే సమయానికి ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ & ఫ్యామిలీ 179 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో ఎలన్‌ మస్క్‌ 146 బిలియన్‌ డాలర్లత సంపదతో నిలిచారు. అంటే ఏడాది కాలంలోనే ఏకంగా 200 బిలియన్‌ డాలర్ల సంపదను ఆయన కోల్పోయారన్నమాట. మానవ చరిత్రలో ఇప్పటిదాకా ఇంతలా ఓ వ్యక్తి సంపదను కోల్పోయిందే లేదు. ఇక.. భారత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ 127 బిలియన్‌ డాలర్లతో ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి: రిలయన్స్‌ను ముకేశ్‌ ఎలా ఉరుకులు పెట్టించారో తెలుసా?

మరిన్ని వార్తలు