20 శాతం ట్యాక్స్‌.. అక్టోబర్‌ 1 నుంచే..

21 Sep, 2023 15:52 IST|Sakshi

అంతర్జాతీయ వ్యయాలపై కేంద్రం పెంచిన 20 శాతం టీసీఎస్‌ (TCS) పన్ను అక్టోబర్‌ 1 నుంచే అమలు కానుంది. సరళీకృత రెమిటెన్స్ పథకం (LRS) కింద ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల పరిమితికి మించి చేసిన విదేశీ ఖర్చులపై మూలం వద్ద ఈ పన్నును వసూలు చేస్తారు.

విద్య లేదా వైద్య సంబంధ చెల్లింపులు మినహా ఇతర విదేశీ ఖర్చులపై ఈ పన్నును కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా అక్టోబర్‌ 1 నుంచి 20 శాతం ఉంటుంది.

LRS కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది. LRS చెల్లింపులు, వారి వెల్లడించిన ఆదాయాల మధ్య వ్యత్యాసాలను గుర్తించిన ఆర్థిక శాఖ LRS కింద కొత్త టీసీఎస్‌ రేట్లను 2023 బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించింది.

కొత్త రేట్లు వైద్య లేదా విద్యా ఖర్చులపై ఎటువంటి మార్పును తీసుకురానప్పటికీ, రియల్ ఎస్టేట్, బాండ్లు, విదేశీ స్టాక్‌లు, టూర్ ప్యాకేజీలు లేదా ప్రవాసులకు పంపే బహుమతులు వంటి వాటికి చేసే ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి.

ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 206C, సబ్-సెక్షన్ 1G ప్రకారం.. LRS లావాదేవీలపై, విదేశీ టూర్ ప్యాకేజీల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం టీసీఎస్‌ను వసూలు చేస్తుంది. 

మరిన్ని వార్తలు