కొత్త కారు కొనాలా? 10 నెలలు ఆగాల్సిందే!

6 Jan, 2021 13:52 IST|Sakshi

కోవిడ్‌-19 నేపథ్యంలో సొంత వాహనాలకు డిమాండ్‌

ప్లాంట్ల తాత్కాలిక మూసివేతతో తగ్గిన సరఫరాలు

కొన్ని మోడళ్లలో అతితక్కువ ఉత్పత్తి సామర్థ్యం

కార్ల డెలివరీకి వేచిచూడాల్సిన సమయం 1-10 నెలలు

జాబితాలో మారుతీ, హ్యుండాయ్‌, ఎంఅండ్‌ఎం, నిస్సాన్‌..

చెన్నై, సాక్షి: జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసిన కోవిడ్‌-19 నేపథ్యంలో ఇటీవల సొంత వాహనాలకు డిమాండ్‌ పెరిగింది. దీనికితోడు దశాబ్ద కాలపు కనిష్టాలకు వడ్డీ రేట్లు చేరడం వాహన కొనుగోలుదారులకు ప్రోత్సాహాన్నిస్తోంది. అయితే ఇదే సమయంలో ఆటో రంగ కంపెనీలు నిర్వహణను మెరుగుపరిచేందుకు తాత్కాలికంగా ప్లాంట్లను నిలిపివేయడం, మరికొన్ని కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు వాహన సరఫరాలకు అంతరాయాలను కల్పిస్తున్నట్లు ఆటో రంగ నిపుణులు వివరించారు. దీంతో ప్రధానంగా కొన్ని కార్ల కంపెనీలు డిమాండుకు తగిన సరఫరాలు చేయలేకపోతున్నట్లు తెలియజేశారు. వెరసి అధిక డిమాండ్‌ కలిగిన మోడళ్లలో కొత్త కారును కొనుగోలు చేయాలంటే వినియోగదారులు కనీసం 30 రోజుల నుంచి 10 నెలల వరకూ వేచిచూడవలసిన పరిస్థితులు నెలకొన్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం..   (మళ్లీ మండుతున్న చమురు ధరలు)

చిన్న కార్లు, ఎస్‌యూవీలు సైతం
కొంతకాలంగా స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనా(ఎస్‌యూవీ)లకే కాకుండా చిన్న కార్లకు సైతం డిమాండ్‌ పెరుగుతున్నట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. దీంతో ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలతోపాటు.. ఆటో దిగ్గజం మారుతీ తయారీ చిన్న కార్లకు సైతం వెయిటింగ్‌ పిరియడ్‌ నడుస్తున్నట్లు చెప్పారు. ఉదాహరణగా మారుతీ తయారీ ఆల్టో, వేగన్‌-ఆర్‌, స్విఫ్ట్‌తోపాటు.. హ్యుండాయ్‌ తయారీ ఐ20, వెర్నా తదితర కార్ల కొనుగోలు కోసం 1-10 నెలల సమయం వేచిచూడవలసి వస్తున్నట్లు పేర్కొన్నారు.

పూర్తి సామర్థ్యంతో
నిజానికి గత అక్టోబర్‌ నుంచీ మారుతీ సుజుకీ ప్లాంట్లు 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. అయినప్పటికీ స్విఫ్ట్‌, ఆల్టో, వేగన్‌-ఆర్‌ మోడళ్ల కార్లను సొంతం చేసుకునేందుకు కనీసం 3-4 వారాలు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఎర్టిగా మోడల్‌ డెలివరీకి 6-8 వారాలు వేచిచూడవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల మారుతీ నిర్వహణాసంబంధ కార్యక్రమాల కోసం ప్లాంట్లను వారం రోజులపాటు మూసివేసింది. ఇక హ్యూండాయ్‌ క్రెటా తదితర ప్రధాన మోడళ్ల తయారీని పెంచే సన్నాహాల్లో ఉంది. క్రెటా రోజువారీ తయారీ సామర్థ్యాన్ని గత ఆరు నెలల్లో 340 యూనిట్ల నుంచి 640 యూనిట్లకు పెంచినట్లు హ్యుండాయ్‌ తెలియజేసింది. ఈ బాటలో వెన్యూ, వెర్నా తయారీని పెంచుతున్నట్లు పేర్కొంది. ఇక 2-3 నెలల వెయిటింగ్ ఉంటున్న ఐ20 మోడల్‌ కార్ల తయారీని ఇటీవల నెలకు 9,000 నుంచి 12,000 యూనిట్లకు పెంచినట్లు వెల్లడించింది. వెర్నా మోడల్‌ కార్లను 40 శాతం వరకూ ఎగుమతి చేస్తున్నట్లు తెలియజేసింది.

ఎంఅండ్‌ఎం సైతం
ఇటీవల భారీగా పెరిగిన డిమాండుకు అనుగుణంగా నాసిక్‌లో వాహన ఉత్సాదక సామర్థ్యాన్ని పెంచినట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలియజేసింది. దీంతో నెలకు 2,000 యూనిట్ల తయారీ నుంచి ప్రస్తుతం 3,500 యూనిట్లవరకూ పెరిగినట్లు వెల్లడించింది. ఎంఅండ్‌ఎం ఇటీవలే విడుదల చేసిన థార్‌ మోడల్‌ వాహన డెలివరీకి 20-40 వారాలు పడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఇదేవిధంగా నిస్సాన్‌ మ్యాగ్నైట్‌ మోడల్‌ తయారీని 2700 యూనిట్ల నుంచి నెలకు 4,000 వాహనాలకు పెంచినట్లు పేర్కొంది. కాగా.. మరోపక్క కియా మోటార్స్‌ ఇంజిన్లు, బంపర్ల సరఫరా సమస్యల కారణంగా సెల్టోస్‌, సోనెట్ మోడళ్ల డెలివరీకి 2-3 నెలల కాలం పడుతున్నట్లు ఆటో నిపుణులు తెలియజేశారు. కాగా.. డిసెంబర్‌లో గత దశాబ్ద కాలంలోలేని విధంగా ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు 2,76,500 యూనిట్లకు చేరాయి. వార్షిక ప్రాతిపదికన 18 శాతం జంప్‌చేసినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. 

మరిన్ని వార్తలు