మార్కెట్లపై కరోనా పంజా!

22 Dec, 2020 00:01 IST|Sakshi

ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన కొత్త రకం కరోనా   

గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ 

సెన్సెక్స్‌ 1,407 పాయింట్లు క్రాష్‌

ఏడు నెలల్లో అతిపెద్ద పతనం 

432 పాయింట్లు కుప్పకూలిన నిఫ్టీ 

ముంబై: రోజుకో కొత్త రికార్డును తిరగరాస్తూ జోరుమీదున్న సూచీలకు సోమవారం అమ్మకాల షాక్‌ తగిలింది. కొత్త రకం కరోనా వైరస్‌ భయాలు మార్కెట్‌ను మరోసారి వెంటాడడంతో పాటు జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఏడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి వెల్లువెత్తిన అమ్మకాల సునామీతో సెన్సెక్స్‌ 47,000– 46,000 పాయింట్ల స్థాయిలను ఒకే రోజులో కోల్పోయింది. చివరికి 1,407 పాయింట్లు కుప్పకూలి  45,554 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 13,328 వద్ద ముగిసింది. దీంతో సూచీల ఆరురోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడినట్లైంది.

మార్కెట్‌ భారీ పతనంతో అన్ని రంగాల ఇండెక్స్‌లు భారీ నష్టాల మూటగట్టుకున్నాయి. అత్యధికంగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాల షేర్లలో విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్‌ 2038 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 44,923 స్థాయిని చేరుకుంది. నిఫ్టీ 629 పాయింట్లు క్షీణించి 13,131 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. రూపాయి విలువ 23 పైసల నష్టాన్ని చవిచూసి 73.79  వద్ద స్థిరపడింది.  నిఫ్టీ–50 ఇండెక్స్, సెన్సెక్స్‌ సూచీల్లో ఏ ఒక్క షేరు లాభపడలేదు.  కొత్త రకం కరోనా విజృంభణతో బ్రిటన్, భారత్‌ల మధ్య డిసెంబర్‌ 31 వరకు విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటనతో ఎయిర్‌లైన్స్‌ షేర్లు 10% నష్టాన్ని చవిచూశాయి.  స్టాక్‌ మార్కెట్లో  వొలటాలిటీ(వీఐఎక్స్‌) ఇండెక్స్‌ అనూహ్యంగా 25% పెరిగి 23 స్థాయిపైన ముగిసింది. ఈ ఇండెక్స్‌ ఎంత ర్యాలీ చేస్తే మార్కెట్లో అంత ఒడిదుడుకులు ఉన్నట్లు భావిస్తారు.

నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం...
సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.178 లక్షల కోట్లకు దిగివచ్చింది. 

నష్టాలు ఎందుకంటే...
తెరపైకి కొత్త రకం కరోనా  భయాలు... 
ఈ ఏడాది ప్రథమార్ధం చివర్లో మార్కెట్‌ పతనాన్ని శాసించిన కరోనా భయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోవిడ్‌–19 నియంత్రణకు వ్యాక్సిన్‌ పంపిణికీ సిద్ధమవుతున్న వేళ వైరస్‌ తాజాగా రూపు మార్చుకుని ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఈ కొత్త వైరస్‌ విజృంభణతో యూరప్‌లో పలు దేశాలు పరిమితితో కూడిన లాక్‌డౌన్‌ను విధించగా, బ్రిటన్‌ పూర్తిలాక్‌ స్థాయిలో ఆంక్షలను అమలు చేస్తోంది. బ్రిటన్‌ నుంచి భారత్‌ వచ్చే విమాన సర్వీసులను డిసెంబర్‌ 31 వరకు నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లు  అన్ని రంగాలలోనూ అమ్మకాలకు తెరతీశారు.

►గరిష్టస్థాయిల లాభాల స్వీకరణ.... 
గత కొన్ని రోజులుగా సూచీలు ముగింపులోనూ, ఇంట్రాడేలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుండడంతో పలు షేర్లు అధిక వ్యాల్యుయేషన్‌ వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. దీనికి తోడు క్రిస్మస్, ఏడాది ముగింపు సెలవులు రానున్న నేపథ్యంలో ఇన్వెసర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.  

►బలహీన అంతర్జాతీయ సంకేతాలు...  
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ యూరో దేశాల్లో విజృంభించడంతో బ్రిటన్‌ అంతటా లాక్‌డౌన్‌ను విధించారు. అలాగే బ్రెగ్జిట్‌పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు చెందిన సూచీలు 3 శాతం నష్టంతో ముగిశాయి. ఆసియాలో జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్‌ సింగపూర్‌ దేశాల ఈక్విటీ సూచీలు 1 శాతం నుంచి 5 శాతం  వరకు నష్టాలతో ముగిశాయి.

>
మరిన్ని వార్తలు