New Delhi: దేశంలో ఆఫీస్‌ స్పేస్‌.. ఆ నగరం చాలా కాస్ట్‌లీ గురూ!

28 Jul, 2022 09:06 IST|Sakshi

ఆసియా పసిఫిక్‌లో పదో స్థానం 

నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదిక 

న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్లలో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ పదో స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. 2022 ఏప్రిల్‌–జూన్‌ కాలానికి సంబంధించి ప్రైమ్‌ ఆఫీస్‌ రెంటల్‌ ఇండెక్స్‌ గణాంకాలను విడుదల చేసింది. ఢిల్లీలో వాణిజ్య స్థలం చదరపు అడుగు లీజు రేటు ఏడాదికి 51.6 డాలర్లుగా (రూ.4,128) ఉన్నట్టు తెలిపింది. హాంగ్‌కాంగ్‌ అత్యంత ఖరీదైన ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌గా ఉంది. ఇక్కడ ఏడాదికి చదరపు అడుగు అద్దె 175.4 డాలర్లుగా ఉంది.

ముంబై 11వ స్థానంలో నిలిచింది. ముంబైలో చదరపు అడుగు వాణిజ్య స్థలానికి లీజు రేటు 45.8 డాలర్లుగా (రూ.3,664) ఉంది. బెంగళూరులో చదరపు అడుగు లీజు రేటు ఏడాదికి 20.5 డాలర్లుగా (రూ.1,640) ఉండగా, ఇండెక్స్‌లో 22వ స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాదిలో బెంగళూరులో వాణిజ్య స్థలం లీజు రేటు 12 శాతం పెరిగినట్ట నైట్‌ఫ్రాంక్‌ తెలిపింది. కరోనా షాక్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడంతో, ఎన్నో రంగాల నుంచి కొత్త స్థలాల లీజుకు డిమాండ్‌ పెరిగినట్టు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు. ఈ ఇండెక్స్‌లో అత్యంత ఖరీదైన మార్కెట్లుగా సిడ్నీ, సింగపూర్, టోక్యో, హోచిమిన్‌ సిటీ, బీజింగ్, మెల్‌బోర్న్, పెర్త్, బ్రిస్బేన్‌ వరుసగా రెండు నుంచి తొమ్మిదో స్థానం వరకు ఉన్నాయి.
     

మరిన్ని వార్తలు