ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్‌ చేస్తే 75 కోట్ల టర్నోవర్‌

9 Sep, 2022 16:08 IST|Sakshi

వ్యాపారం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పట్టుదల, కృషితో తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. ప్రస్తుతం అలాంటి ముగ్గురు స్నేహితుల విజయగాథ ఇది. రెండు లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోట్ల రుపాయలు టర్నోవర్‌ చేస్తున్నారు. అందరిలానే చదువు పూర్తి చేసుకుని కొన్నా‍ళ్లు ఉద్యోగం చేసి సంతృప్తి చెందక వ్యాపారం వైపు అడుగులు వేశారు హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్, సుమన్ పాత్ర.

2 లక్షలు పెట్టుబడి.. 75 కోట్ల టర్నోవర్‌
వ్యాపారం చేద్దామని అనుకునే సమయానికి వారి వద్ద కేవలం రూ.2 లక్షలు మాత్రం ఉంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి 2010లో ఫ్లవర్ ఆరా పేరుతో కంపెనీని ప్రారంభించారు. ఇందులో పూలు, కేకులు, బహుమతులు వంటి వస్తువులకు సంబంధించిన ఆన్‌లైన్ సేవలను అందిస్తూ వచ్చారు. ప్రారంభంలో, ఆ కంపెనీలో ఒక ఉద్యోగి మాత్రమే ఉన్నాడు. అదే ఉద్యోగి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌గా పని చేయడంతో సహా కార్యకలాపాలు, డెలివరీ వంటి అన్ని అంశాలను నిర్వహించేవాడు. అనుకోకుండా వాలెంటైన్స్ డే వాళ్ల కంపెనీకి చాలా ఆర్డర్లు వచ్చాయి. స్టాఫ్‌ ఒక్కరే కావడంతో సహ వ్యవస్థాపకులు హిమాన్షు, శ్రే కూడా డెలివరీ కోసం వెళ్ళవలసి వచ్చింది. ఇక అప్పటి నుంచి చాలా సందర్భాల్లో కేకులు ఎక్కువగా విక్రయాలు జరుగుతుండడం గమనించారు. దీంతో 2016 సంవత్సరంలో బెకింగో అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించారు.

ఈ కంపెనీ దేశంలోని వివిధ ప్రాంతాలకు ఒకే బ్రాండ్‌కు చెందిన తాజా కేక్‌లను డెలివరీ చేస్తూ బెకింగోని విస్తరింపజేశారు. ప్రస్తుతం, కంపెనీ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు మీరట్, పానిపట్, రోహ్తక్ కర్నాల్ వంటి చిన్న నగరాలకు సేవలందిస్తోంది. కంపెనీ విక్రయాల్లో 30 శాతం వెబ్‌సైట్ ద్వారానే 70 శాతం అమ్మకాలు స్విగ్గీ, జొమాటో ద్వారా జరుగుతున్నాయి. అలా 2021-22లో బెకింగో 75 కోట్లకు పైగా టర్నోవర్‌ చేరకుంది. ప్రస్తుతం కంపెనీలో 500 మందికి పైగా పనిచేస్తున్నారు. కంపెనీ ఈ ఏడాది తన మొదటి ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌ను ఢిల్లీలో ప్రారంభించింది.

చదవండి: గూగుల్‌ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!

మరిన్ని వార్తలు